‘మా హయాంలో భూ అక్రమాలు జరిగాయని అంటున్న మీరు దమ్ముంటే భూ అక్రమాలపై ఏ విచారణ అయినా చేయించుకో’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి మాజీమంత్రి పరిటాల సునీత సవాల్ విసిరారు. అనంతపురంలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేస్తున్న భూ అక్రమాల ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి, కురుగుంట, రాచానపల్లి, సోములదొడ్డి, ఇటుకలపల్లి, అక్కంపల్లి, కొడిమి పొలాల్లోనే సర్వే నెంబర్లల్లో టీడీపీ హయాంలో వేలాది మందికి నకిలీ పట్టాలిచ్చారని జిల్లా కలెక్టర్‌ను కలిసి చెప్పుకున్నావ్. విజిలెన్స అధికారులతో విచారణ చేయించాలని అడిగావ్. మీ ముఖ్యమంత్రి జగన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకుంటున్నావ్. నెలకోసారి... రెండు నెలలకోసారి మీడియా ముందుకొచ్చి టీడీపీ ఫేక్ పట్టాలిచ్చిందని బురద జల్లడం ఎందుకు? ధైర్యముంటే నిరూపించు అని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో నకిలీ పట్టాలిచ్చి ఉంటే నాలుగేళ్ల మీ పాలనలో ఎమ్మెల్యేగా ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. మీ పార్టీనే కదా అధికారంలో ఉంది విచారణ చేయించుకో, ఎవరొద్దన్నారు అని ఆమె ఎమ్మెల్యేకి సూచించారు. విజిలెన్స విచారణ కోరుతున్నావ్ కదా... ఆ విచారణ సరిపోదేమో అవసరమైతే సీబీఐ చేత కూడా విచారణ చేయించుకో. ఏ విచారణ చేయిస్తావో ఆ విచారణకు మా పార్టీ మండల కన్వీనర్లు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అది మానేసి ప్రతిసారీ పరిటాల సునీత హయాంలో నకిలీ పట్టాలిచ్చారంటూ ఆరోపణలు చేస్తూ బురదచల్లితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాలతో పాటు... మీ నాలుగేళ్ల ఏలుబడిలో ఇచ్చిన పట్టాలు, జరిగిన భూ అక్రమాలు విచారణ చేయించాలని ఆమె ఎమ్మెల్యేకి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్న ఆరోపణలపై విచారణ చేయించాలని కలెక్టర్‌ను తాను కోరుతున్నానన్నారు. విచారణలో తమ తప్పుందని రుజువైతే దేనికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. చేయాల్సిన పని వదిలేసి 24 గంటలూ పరిటాల కుటుంబం మీద పడి ఏడవడం ఇకనైనా మానుకోవాలని ఆమె ఎమ్మెల్యేకి హితవు పలికారు.