అవనిగడ్డ , నాగాయలంక మండలం పెదపాలెం గ్రామానికి చెందిన దళిత యువకుడి అరెస్టు వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారటంతో అవనిగడ్డలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెదపాలెం గ్రామానికి చెందిన కైతేపల్లి దుర్గారావును ఓ సివిల్ వ్యవహారంలో బాపట్ల జిల్లా రేపల్లె పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. రేపల్లెలో పంట ఎత్తుకుపోయిన వ్యక్తిని, ట్రాక్టర్ డ్రైవర్‌ను వదిలేసి వారి వెంట ఉన్న దుర్గారావును ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు అరెస్టు చేస్తేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు తమతో అమర్యాదగా ప్రవర్తించారని మహిళలు ఆరోపించారు. ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయి దాదాపు నాలుగు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది వచ్చిన దుర్గారావును సంఘ విద్రోహిని అరెస్టు చేసినట్లుగా తెల్లవారుజామున ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయటం పట్ల దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భర్తకు కనీసం పండ్ల రసం ఇచ్చేందుకు కూడా పోలీసులు అనుమతించకపోవటంతో మనస్తాపానికి గురైన చెందిన దుర్గారావు భార్య పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దళిత సంఘాలు ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకుని వెంటనే మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన రేపల్లె ఎస్సైపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి వద్ద రాస్తారోకో నిర్వహించాయి. దాదాపు అరగంటకుపైగా అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అవనిగడ్డ సీఐ శ్రీనివాస్, అవనిగడ్డ, నాగాయలంక ఎస్సైలు రమేష్, సుబ్రహ్మణ్యం దళిత నేతలతో చర్చలు జరిపి వారు కోరినట్లుగా కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వటంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించాయి. దళిత నేతలు కొల్లూరి వెంకటేశ్వరరావు, మాచవరపు ఆదినారాయణ, కర్రా సుధాకర్, దున్నా రాజేష్, ఇమ్మానియేలు పాల్గొన్నారు.