రెవిన్యూ అర్జీలను గడువులోగా పరిష్కరించకపోతే రెవిన్యూ అధికారులు నేరం చేసినట్లేనని జిల్లా సంయుక్త కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. రెవిన్యూ అంశాలపై డివిజన్, మండలస్థాయి అధికారులతో కలెక్టరేట్ నుంచి బుధవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రెవిన్యూ అంశాలపై ప్రజలనుంచి అధిక సంఖ్యలో అర్జీలు వస్తున్నాయని జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. వాటిని ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రెవిన్యూ సమస్యలపై ప్రతిరోజు మండలస్థాయి అధికారులతో విధిగా ఆర్. డి. ఓ. లు సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం రెవిన్యూ అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న 217 అర్జీలు తక్షణమే పరిష్కరించాలన్నారు. రీసర్వేలో వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారమార్గం చూపాలన్నారు. రెవిన్యూ దస్త్రాల స్వచ్ఛీకరణ ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలన్నారు. భూ సర్వే సమయంలో భూమి హక్కుదారులను పిలిపించి హద్దులు చూపాలన్నారు. హద్దురాళ్లు వేసే ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలన్నారు. గృహనిర్మాణాల ప్రక్రియ వేగంగా జరిగేలా అధికారులు సహకరించాలన్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో నిబద్దతతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. లబ్దిదారులకు రుణాలు పంపిణీ చేసే ప్రక్రియలో మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తంచేశారు. అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతినకుండా టార్పాలిన్ పట్టలు రైతులకు అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. ఇప్పటివరకు బాపట్లలో 8, 119 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు టార్పాలిన్ పట్టలు శరవేగంగా రైతులకు చేరవేయాలన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలకు విపత్కర సంఘటనలు జరుగకుండా చూడాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరిగినా తక్షణమే కలెక్టరేటుకు సమాచారం చేరవేయాలన్నారు. సమావేశంలో డి. ఆర్. ఓ. కె. లక్ష్మీశివజ్యోతి, గృహనిర్మాణ శాఖ పి. డి. ప్రసాద్, సి. పి. ఓ. జి. భరత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.