ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముమ్మరం చేసింది. ఈ క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటనా స్థలంలో లభించిన లేఖపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బుధవారం వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాష్‌ను సీబీఐ అధికారులు విచారించారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో కృష్ణారెడ్డిని అధికారులు సుమారు 5 గంటల పాటు పలు అంశాలపై ప్రశ్నించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లేఖను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందనే విషయంపైనే సీబీఐ అధికారులు వీరిని చాలాసేపు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనపై దాడి జరిగిన సమయంలో వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖ ఘటనా స్థలిలో ముందుగా కృష్ణారెడ్డి చేతికే చిక్కింది. అయితే, ఉదయం దొరికిన ఆ లేఖను పోలీసులు అక్కడికి చేరుకున్నా కూడా కృష్ణారెడ్డి వారికి ఇవ్వలేదు. వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి దాన్ని దాచి ఉంచమని తనకు సూచించినట్లు తర్వాత కృష్ణారెడ్డి వెల్లడించారు.
మరోవైపు వైఎస్ వివేకా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్‌ను సైతం సీబీఐ అధికారు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఆ లేఖ దాచి పెట్టడంపై ప్రకాష్‌ను అధికారులు వివరణ అడిగారు. పీఏ కృష్ణారెడ్డి ద్వారా లెటర్‌ను దాచి పెట్టాడని ప్రకాష్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివేకా లేఖపై సీబీఐ కూపీ లాగుతుంది.
ఇదిలావుంటే సాక్ష్యాలను తారుమారు చేశారన్న కారణంతో వివేకా పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఈ లేఖ విషయమై కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పదేపదే ఆరోపణలు చేస్తున్న విషయంతెలిసిందే. ఆ లేఖను ఎందుకు దాచారనే కోణంలో సీబీఐ దర్యాప్తు జరగడం లేదని.. తనను మాత్రమే లక్ష్యంగా చేసుకొని విచారిస్తున్నారంటూ ఆయన పలు సందర్భాల్లో ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తాజాగా, కృష్ణారెడ్డిని, ప్రకాష్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. నాలుగు రోజుల క్రితమే సీబీఐ అధికారులు పులివెందులలో కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసు జారీ చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం కృష్ణారెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు.