విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాకిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు క్యాంపస్‌లలో ఆఖరి ఏడాది పూర్తి చేసుకున్న నాలుగు వేల మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించని కారణంగా ఆర్జీయూకేటీ ధ్రువపత్రాలను నిలిపివేసింది. దీంతో పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని గడువు మేరకు ఎప్పటికప్పుడు తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని సీఎం జగన్ చెబుతున్న గొప్పల్లో డొల్లతనం బయటపడినట్లైంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఆఖరి సంవత్సర విద్యార్థులు పూర్తి బకాయిలను ఈరోజు సాయంత్రంలోగా చెల్లించకపోతే బయటకు అనుమతి లేదని, అల్పాహారం, వసతి కట్ చేయాలని, ధ్రువపత్రాలు ఇవ్వవద్దంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇంటర్నషిప్‌తో ప్లేస్‌మెంట్ సాధించిన విద్యార్థులు ఆయా కంపెనీల్లో హాజరుకాల్సి ఉండగా.. అధికారుల ఉత్తర్వులతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. చదువు పూర్తయినప్పటికీ విద్యాదీవెన అందకపోవడంతో విద్యార్థులకు కళాశాలల యాజమాన్యం ధ్రువపత్రాలు నిలిపివేయడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.