ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని జిల్లా ఎస్‌పి జిఆర్ రాధిక అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ఆమె ప్రారంభించి మాట్లాడారు. మృతి చెందిన జిల్లాకు చెందిన సీనియర్ క్రికెటర్లు సయ్యద్ ఇషాక్ మహ్మద్, వీఎన్ పంతులు, సివి రాజారెడ్డి, మీర్ మహ్మద్ చిత్రపటాలకు పుష్పాలతో అంజలి ఘటించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందన్నారు. యువత క్రీడల్లో రాణించి మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. క్రీడల వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులను సైతం ఎదుర్కొనే మానసిక స్థైర్యం కలుగుతుందని చెప్పారు. స్వయంకౄషి, ప్రతిభను నమ్ముకొని మాత్రమే రాణించేందుకు ప్రయత్నించాలని, ఇతర మార్గాల్లో ఎదగాలనుకునే వారికి విజయం వారి వెంట ఎక్కువ రోజులు ఉండదన్నారు.
క్రీడలను ప్రోత్సహించే దిశగా జిల్లా కేంద్రంలోనే కాకుండా సబ్‌సెంటర్లలో సైతం కోచింగ్ క్యాంపు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. క్రికెట్ లో ఉన్నతంగా రాణించి ఐపీఎల్‌తో పాటు ఇండియా జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. జిల్లా క్రికెట్ సంఘం సెక్రటరీ ముస్తాక్ మహ్మద్ మాట్లాడుతూ ఈ కోచింగ్ క్యాంపు 25 రోజుల పాటు ఉంటుందని, ఈ కోచింగ్ క్యాంపు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారని వివరించారు. అనంతరం ఇలాజ్ మహ్మద్ సహకారంతో అందించిన కిట్లను ఎస్‌పి రాధిక ఆయా సబ్‌సెంటర్ల కోచ్‌లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సి రెడ్డి, కె. ఎస్ మదీనా షైలానీ, బెనర్జీ, దివాకర్, చీఫ్ కోచ్ సుదర్శన్, జోన్ చీఫ్ సెలక్టర్ దీపక్‌కుమార్, సీనియర్ క్రికెటర్ భద్రగిరి మురళీ, ఆనంద్, ఆర్ట్స్ కళాశాల పీడీ మోహన్, రాజు, కొయ్యాన మధు, కోచ్‌లు ఎం రాజాబాబు (కళింగపట్నం), కె. శ్రీనివాస్ (టెక్కలి), అనీల్ (నరసన్నపేట), కె. సుదర్శన్ (శ్రీకాకుళం), గోపి (ఇచ్ఛాపురం), మహిళా కోచ్ లు రమణమ్మ, దమయంతి, ఫిట్‌నెస్ కోచ్ పి. రాజ్ తదితరులు పాల్గొన్నారు.