ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశేష సేవలందించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని ఆర్యవైశ్య ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లోని ఆర్యవైశ్యుల బలాన్ని, సేవలను గుర్తించి రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా వైశ్యులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని తీర్మానించారు. రాజమహేంద్రవరంలోని ఒక హోటల్‌లో ఆదివారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఆర్యవైశ్యుల ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఏపీఐఐడీసీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు శ్రీఘాకొళ్లపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేయడంతో పాటు సుదీర్ఘకాలం ఆర్థికమంత్రిగా, గవర్నర్‌గా, ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్యను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం బాధకలిగించిందన్నారు. రాజకీయ పదవుల కోసమో, రాజకీయంగా లబ్ధిపొందాలనో ఆశించి ఈ సమావేశం పెట్టలేదన్నారు. రోశయ్య స్మృతివనం ఏర్పాటు చేసి అందులో ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగిందన్నారు. రోశయ్య పేరుమీద తపాలా బిళ్లను, నాణాన్ని ముద్రించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించామని తెలిపారు. పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు. నవంబరులో ఉభయ రాష్ట్రాల ఆర్యవైశ్యులతో రాజమహేంద్రవరంలో ఆర్యవైశ్య శంఖారావం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రోశయ్య కుమారుడు శివ సుబ్బారావు మాట్లాడుతూ మేం కుటుంబ సభ్యులమే అయినా మా కన్నా మీరే నాన్నకు పెద్ద కుటుంబ సభ్యులుగా ఉన్నారన్నారు. రోశయ్య అల్లుడు పైడా కృష్ణప్రసాద్, ఆర్యవైశ్య ప్రముఖులు కంచర్ల వెంకట్రావు (బాబి), మహంకాళి రంగప్రసాద్, నాళం ఆండాళ్, శోభారాణి, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రతినిధులు పాల్గొన్నారు.