మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు నేపథ్యంలో, అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను గుర్తించి, వారిని రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించామని రాష్ట్ర విద్యాశాఖామత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటివరకు సుమారు వంద మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇంకా ఎవరైనా ఉంటే , రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ను సంప్రదించాలని సూచించారు. విజయనగరంలోని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ, మణిపూర్ విద్యార్థుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెల్లామని, అక్కడ చదువుతున్న విద్యార్థుల జాబితాను రూపొందించామని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రితో కూడా మాట్లాడటంజరిగిందన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని కోరారు. ఇంకా 50 మంది వరకు ఉండచ్చు నని అంచనా వేస్తున్నామని, 150 మంది కి సరిపడ్డ విమానం ఏర్పాటు చేశామని తెలిపారు. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.