ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం 65మంది జడ్పీటీసీలు, 873 మంది ఎంపీటీసీలు, 684 మంది సర్పంచులు ఉన్నారు. వీరికి ప్రతినెలా గౌరవ వేతనం అందించాల్సి ఉంది. కానీ, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు ఇంకా గౌరవ వేతనం అందలేదని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. ఈ మూడు నెలలకు సంబంధించి.. జడ్పీటీసీలకు రూ.6 వేలు వంతున ఈరూ.11.70 లక్షలు, ఎంపీటీసీలకు రూ.3 వేల వంతున రూ.78.57 లక్షలు, సర్పంచులకు రూ.3 వేలు వంతున రూ.61.56 లక్షల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వీరితో పాటు చిత్తూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన 99 మంది కార్పొరేటర్లు, పుంగనూరు, పలమనేరు, మదనపల్లె, కుప్పం, నగరి, పుత్తూరు మున్సిపాలిటీలకు చెందిన 173 మంది కౌన్సిలర్లకూ గౌరవవేతనం అదనం. మొత్తమ్మీద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రూ.2 కోట్లకుపైనే బకాయిలున్నాయి. జడ్పీ కార్యాలయం నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీల గౌరవవేతనాలను చెల్లించేందుకు సీఎ్‌ఫఎంఎస్ ద్వారా ఏ నెలకానెల బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వద్దే నిలిచిపోతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో 90శాతం మంది వైసీపీ మద్దతుదారులే ఎన్నికయ్యారు. ఆ పార్టీ నుంచి గెలుపొందిన ప్రజాప్రతినిధులు సకాలంలో గౌరవవేతనం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జిల్లాపరిషత్ సాధారణ నిధుల నుంచి ప్రజాప్రతినిధులు పలు రకాల అభివృద్ధి పనులు చేశారు. అయితే ఆయా పనులకు సంబంధించిన బిల్లులు కూడా కోట్లాది రూపాయిలు పెండింగ్‌లో వున్నాయి. ఇలా అన్నిరకాల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఇదే అంశాన్ని డీపీవో లక్ష్మి వద్ద ప్రస్తావించగా.. బకాయిల వివరాలను సీఎ్‌ఫఎంఎ్‌సలో అప్‌లోడ్ చేశామని, త్వరలో డబ్బులు అందుతాయని చెప్పారు.