ఉపాధి కోసం రూ.లక్షలు ఖర్చుపెట్టి దళారులను నమ్మి విదేశాలకు వెళ్లి చివరకు దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం, సోంపేట, సంతబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన 23 మంది యువకులు ఉపాధి కోసం ఏడాది కిందట నైజీరియా దేశానికి వెళ్లారు. అక్కడ కంపెనీల్లో పనులు కల్పిస్తామని ఏజెంట్లు నమ్మబలికించడంతో వారికి ముందుగా కొంతమొత్తం ముట్టజెప్పారు. తీరా నైజీరియా వెళ్లాక.. అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. పనిచేస్తున్న కంపెనీల్లో తొమ్మిది నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో కడుపు నిండా తిండి కూడా దొరక్క అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చేసేది లేక సోషల్‌మీడియా ద్వారా తమ బాధలను వీడియో తీసి.. కుటుంబసభ్యులు, బంధువులకు పంపించారు. ఈ విషయం ఎంపీ రామ్మోహన్‌నాయుడు దృష్టికి చేరింది. ఆయన తక్షణమే స్పందించారు. నైజీరియాలో ఎంమతంది చిక్కుకుపోయారు?. వారి వివరాలను, పాస్‌పోర్టు నంబర్‌లను యుద్ధప్రాతిపదికన సేకరించారు. జాబితాను తయారుచేసి విదేశీ వ్యవహారాల కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ పంపారు. ఉపాధి కోసం వెళ్లి నైజీరియాలో చిక్కుకుపోయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 23 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని లేఖలో కోరారు. మొత్తం 150 మంది వర్కర్లు నైజీరియాలో ఇబ్బందులకు గురవుతున్నారని.. శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు 23 మంది ఉన్నారని లేఖలో వివరించారు. అలాగే నైజీరియాలో చిక్కుకుపోయిన బాధితులతో ఎంపీ ఫోన్‌లో మాట్లాడారు. వీడియో కాల్‌చేసి వారికి భరోసా కల్పించారు. క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.