రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ అనుమతి లేకుండా ఈ నెల మే 11వ తేదీన పాదయాత్రకు సచిన్ పైలెట్ సిద్ధపడ్డారు. ఆజ్మీర్ నుంచి జైపూర్ వరకు జనసంఘర్ష్ పేరుతో 50 కిమి మేర పాదయాత్రకు సచిన్ పైలెట్ సిద్ధమయ్యారు. వసుంధరా రాజే సింధియా ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని సచిన్ పైలెట్ సీఎం గెహ్లాట్ ను డిమాండ్ చేస్తున్నారు. 2020లో తమ ప్రభుత్వం పడిపోకుండా వసుంధరా రాజే సింధియా సహకరించారని ఇటీవల సీఎం గెహ్లాట్ చేసిన వాఖ్యలను సచిన్ పైలెట్ తప్పుపడుతున్నారు. తమ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు సోనియా గాంధీ అధినేత కాదు వసుంధరా రాజే సింధియా అంటూ సచిన్ పైలెట్ వ్యంగ్యస్త్రాలు సంధించించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో, సీఎం అశోక్ గెహ్లాట్ తో తాడోపేడో తేల్చుకోవడానికి సచిన్ పైలెట్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా సీఎం గెహ్లాట్ తో సచిన్ పైలెట్ కు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. సచిన్ పైలెట్ వ్యవహారశైలి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.