గంజాయి యువత ప్రాణాలు తీస్తోందని... అలాగే హంతకులనూ కూడా చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడి ప్రాణాలు తీసేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన స్పందించారు. గంజాయి పై ఉదాసీనత అనేది మన బిడ్డల వరకూ తెస్తుందన్నారు. ఏపీలో విచ్చలవిడి గంజాయి వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేయడమే కాదు.. ఏకంగా ప్రాణాలను కూడా తీస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ ఘటన ఒకరి ప్రాణాలు తీయడంతో పాటు.. మరో ఐదుగురిని హంతకులను చేసిందని.. దీనికి ఈ ప్రభుత్వ సమాధానం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. వాడవాడలా విస్తరిస్తున్న గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకని ప్రశ్నించారు. ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోరా? అని నిలదీశారు. పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.