రాజధాని అమరావతి రైతులకు ఏపీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆర్ - 5 జోన్‌లో 1,134 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న సర్కార్.. ఇప్పుడు తాజాగా మరికొన్ని ఎకరాలను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. అమరావతి రాజధానిలో 268 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గురువారం ఉదయం పురపాలక శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఈ జీవోను జారీ చేశారు. యన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు 168 ఎకరాలు, గుంటూరు కలెక్టర్‌కు 100 ఎకరాలు కేటాయిస్తూ జీవో విడుదలైంది. రాజధానిలోని బోరుపాలెంలో 2 ఎకరాలు, పిచుకల పాలెంలో 20 ఎకరాలు, అదే గ్రామంలో వేరే బ్లాకులో 81 ఎకరాలు, అనంతవరం లో 64 ఎకరాలు, నెక్కల్లులో వంద ఎకరాలను పేదలకు ప్రభుత్వం కేటాయించింది. సీఆర్డీఏ కమిషనర్ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు యన్టీఆర్, గుంటూరు, జిల్లాల కలెక్టర్‌లకు ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.