జగన్ పాలనకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టిడిపి నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ యాత్రకు సంఘీభావంగా టీడీపీ నేతలు వారివారి నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గంలో పాదయాత్రను చేపట్టారు. చుండూరు మండలం యడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ... జగన్ దుర్మార్గపు పాలనను వ్యతిరేకిస్తూ లోకేశ్ పాదయాత్రను చేపట్టారని చెప్పారు.
లోకేశ్ పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలను సృష్టించిందని ఆనందబాబు మండిపడ్డారు. కులమతాలకు అతీతంగా ప్రజలతో మమేకమవుతూ లోకేశ్ యాత్ర కొనసాగుతోందని చెప్పారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అనే విషయాన్ని గుర్తించి అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని... లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.