వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని, కానీ ఒక షరతు ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఆమె కండిషన్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నచోట వారిని పోరాడనిస్తామని, తాము వారికి మద్దతు ఇస్తామని, అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. అయితే ఇతర రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ కూడా మద్దతివ్వాలని చెప్పారు.
ఆమె రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు. ఈ పాలనలో దౌర్జన్యం, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం, ప్రజాస్వామ్య హక్కుల బుల్డోజర్ జరుగుతున్నాయని, అందుకే బీజేపీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు, ఏ ప్రాంతంలో బలంగా ఉన్నారో తెలుసుకోవాలన్నారు. ఉదాహరణకు బెంగాల్ లో తాము, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉన్నందున ప్రాంతీయ పార్టీలకు మద్దతివ్వాలన్నారు.
బీహార్ లో నితీశ్, తేజస్వి, కాంగ్రెస్ కలిసి ఉన్నారని, అది వారు నిర్ణయించుకుంటారని చెప్పారు. చెన్నైలో కాంగ్రెస్, స్టాలిన్ స్నేహం కొనసాగుతోందని గుర్తు చేశారు. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ - జేఎంఎం కలిసి ఉన్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలు తమ కంచుకోటలో బీజేపీని ఎదుర్కోవాల్సి ఉందని, కాంగ్రెస్ సొంత సీట్లను గెలుచుకోవడంపై దృష్టి సారించాలన్నారు. యూపీ, బీహార్, ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఇలా ఏ ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నా వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ 200 చోట్ల బలంగా ఉందని, అక్కడ పోటీ చేయాలన్నారు.