గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి మంగళవారం మరో చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా, వరదయ్యపాళెం మండలం ముస్లింపాళెంలో మౌలిక వసతులపై ఆసంతృప్తితో ఉన్న జనం నిరసన తెలిపారు. నాయకులు వస్తారు.. పోతారు తప్ప తమ సమస్యలను పరిష్కరించడంలేదని ఆవేదన చెందారు. కొంతమంది మహిళలు ఎమ్మెల్యే ఎవరో మాకు తెలియదు చూపించండని వైసీపీ నాయకులను ప్రశ్నించగా ఎమ్మెల్యే ఆదిమూలం ముందు కరపత్రాలు తీసుకోండి... మళ్లీ మాట్లాడదాం అంటూ దాటవేత ధోరణితో వెళ్లిపోయారు. అనంతరం గౌసియా నగర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే అక్కడ మహిళలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు. కాలువలు, రోడ్లు లేవని, విద్యుత్ తీగలు ఇళ్ల మీద ప్రమాదకరంగా వెళుతున్నట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జడ్పీటీసీ వెంకటేశ్వర్లు, ఎంపీపీ పద్మప్రియ, సర్పంచ్ అజీజ్, ఎంపీడీవో, తహసీల్దారు తదితరులు పాల్గొన్నారు.