మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను ఎదుర్కుంటున్న వైసీపీ నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సుప్రీం కోర్టు మెట్లెక్కారు. బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా... వివేకా హత్య కేసులో నిన్న (మంగళవారం) ఎంపీ అవినాశ్ సీబీఐ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా... చివరి నిమిషంలో తనకు నాలుగు రోజులు సమయం ఇవ్వాలని సీబీఐని కోరారు. ఈ మేరకు సీబీఐకు ఎంపీ ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. మొదట నిరాకరించిన సీబీఐ... విచారణకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేసింది. ఆ తరువాత కొద్ది గంటలకే అవినాశ్ విజ్ఞప్తిని సీబీఐ అంగీకరించింది. ఈనెల 19న విచారణకు రావాల్సిందిగా మరోసారి ఎంపీకి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరిన అవినాశ్‌రెడ్డికి మార్గమధ్యంలోనే ఆయన వాట్సాప్‌కు సీబీఐ నోటీస్‌లు అందాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈనెల 19న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందే అంటూ స్పష్టం చేసింది. అలాగే విచారణకు రావాలని నోటీసు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లగా... ఆయన లేకపోవడంతో తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి డ్రైవరు నాగరాజుకు సీఆర్‌పీసీ 160 నోటీసును అందించారు. సాయంత్రానికి అవినాశ్ పులివెందులకు చేరుకున్నారు.