శతాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఈసారి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ శ్రేణులతో ప్రధానంగా పబ్లిసిటీ చేసుకుంటూ భూమన జాతరగా మార్చుకున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు టిడిపి నేతలు నరసింహ యాదవ్, బుల్లెట్ రమణ, ఆర్సి మునికృష్ణ , మహేష్ యాదవ్ తదితరులతో కలిసి ఎక్స్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో భక్తులు వేషాలు వేసుకొని స్వచ్ఛందంగా భక్తితో పాల్గొనేవారన్నారు. కానీ ఈసారి భక్తి కాదు, వైఎస్సార్ సీపీ బుక్తి కోసం అన్నట్లుగా జాతర జరిపారని ఆరోపణలు చేశారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని మేనమామ "కంసుని" సోదరికి పుట్టే పిల్లలను కంసుడు చంపుతుంటే ఆదిపరాశక్తి జన్మించి ఆ కంసుని హతమార్చిందని పురాణాలను గుర్తు చేశారు. అలా ఈ జాతర ఆ గంగమ్మకు కూడా ఇష్టం లేని రీతిలో నగర ప్రజలు భయాందోళన చెందేలా నిర్వహించడం బాధాకరమన్నారు. భూమన తీరును మార్చుకోరా అని ప్రశ్నించారు. సీఎం జగనే కరుణాకర్ రెడ్డిని మారాలని హెచ్చరించినా ఫలితం శూన్యమని, ఈ గంగ జాతర నిర్వహణ ఉదాహరణ అని విమర్శించారు. అనాదిగా జరిగే ఆచారాలను ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గంగజాతరలో పూల అలంకరణ విషయంలో సీఎం జగన్ ను పబ్లిసిటీ చేసేలా చేసిన ఏర్పాటును తప్పుపట్టారు. భక్తితో చేయని ఈ జాతర అత్యుత్సాహంతో చేస్తే అబాసు పాలవుతారని హెచ్చరించారు. ఇలాంటి సొంత నిర్ణయాలకు ఇకనైనా పులిస్టాప్ పెట్టాలన్నారు. పునర్నిర్మాణం చేసిన గంగమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఎత్తులో ఉంచడం వలన అభిషేకం చేసేవారి పాదాలను తాకుతూ అమ్మవారి అభిషేక తీర్థం అపవిత్రమై భక్తుల భక్తికి కీడు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అమ్మవారి విగ్రహాన్ని పీఠం నుంచి తగ్గించి గతంలో లా పవిత్ర అభిషేక జలం భక్తులకు అందేలా చూడాలన్నారు. భూమన జాతరపై ప్రతిపక్షాల ను కదిలిస్తే ఇంకా ఎన్నో ఆరోపణల, ప్రశ్నలు వినాల్సి వస్తుందన్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే జనం కోరే జాతర జరిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.