ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టుల నిర్మాణంలో ముందంజలో ఉందని పరిశ్రమలశాఖ కార్యదర్శి కరికాల్‌వలవన్ అన్నారు. కలెక్టర్ పి.రాజాబాబుతో కలిసి బందరుపోర్టు నిర్మాణం జరిగే ప్రాంతం, ఈనెల 22న ముఖ్యమంత్రి బందరు పోర్టు పనులు ప్రారంభించే ప్రాంతంలో ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. తపసిపూడిలో ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ర్టానికి సమీపంలో ఉన్న బందరుపోర్టు ఎగుమతులు, దిగుమతుల్లో ప్రముఖ వ్యాపార కేంద్రంగా భవిష్యత్తులో విరాజిల్లుతుందన్నారు. బందరపోర్టుకు 80వేల టన్నుల సరుకు సామర్థ్యంతో ఓడలువచ్చి ఆగేలా నిర్మాణం జరుగుతుంద్నారు. పోర్టు పనులను గుడవులోగా పూర్తిచేస్తామన్నారు. బందరుపోర్టు నిర్మాణంతో కృష్ణాజిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతోపాటు వేలాదిమందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అనంతరం ముఖ్యమంత్రి బహిరంగసభ ప్రాంతం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో మచిలీపట్నం పోర్టు ఎండీ విద్యాశంకర్, మెఘా ప్రాజెక్టు ప్రతినిధి తులసీదాస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.