తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించేందుకు గురువారం సాయంత్రం శృంగవరపుకోట నియోజకవర్గానికి వస్తున్నారు. అధినేతకు స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. ఎక్కడికక్కడ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. శృంగవరపుకోట పసుపు వర్ణంగా మారింది. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరామప్రసాద్ జిల్లా సరిహద్దు అయిన చింతలపాలెం నుంచి విశాఖ- అరకు రోడ్డు వరకూ స్వాగతం పలుకుతూ ఫెక్సీలు ఏర్పాటు చేశారు. ఎస్.కోట దేవిబొమ్మ కూడలి వద్దనున్న అతి పెద్ద బెలూన్ అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్‌షో, సభాస్థలాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. చంద్రబాబుకు చింతలపాలెం వద్ద స్వాగతం చెప్పేందుకు కొత్తవలస మండలానికి చెందిన పరిసర గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. అక్కడి నుంచి శిరికి గ్రీన్‌సిటీకి చంద్రబాబు చేరాక భీమసింగి చెరకు రైతులు తమ సమస్యలను వివరిస్తారు. అనంతరం కొత్తూరు శివాలయం నుంచి రోడ్‌షో ఉంటుంది. చంద్రబాబు వెంట రోడ్‌షోకు పదివేల మంది వరకు హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చివరిగా దేవిబొమ్మ కూడలిలో బహిరంగ సభ ఉంటుంది. అనంతరం ముఖ్యనాయకులతో మాట్లాడి శిరికి గ్రీన్‌సీటీలో రాత్రి బస చేస్తారు. కాగా ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించి ఇంతవరకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని సీఐ సింహాద్రినాయుడు, ఎస్‌ఐ తారకేశ్వరరావులు తెలిపారు.