పొన్నూరు పట్టణంలో శుక్రవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు పోలీసులకు తీవ్రస్థాయిలో వాగ్ధివాదం జరిగింది. సెంటర్లో ఉన్న కోర్టుకు ఓ కేసు నిమిత్తం హాజరయ్యేందుకు తెదేపా నాయకులు ముక్కుమ్మడిగా బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది. కోర్టుకు వెళుతున్న తమను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని తెదేపా నాయకులు వాదనలకు దిగారు. అదే సమయంలో వైఎస్ఆర్సిపి నాయకులు చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వీరు రావడం తో పోలీసులు ముందస్తు చర్యగా వారిని అడ్డుకోవడం జరిగిందని ఓ పోలీసు అధికారి వివరించారు. అకారణంగా అడ్డుకున్నందుకు పోలీసులకు వ్యతిరేకంగా తెదేపా నాయకులు పెద్దపెట్టున నినాదాలు చేశారు.