ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ఎగిసిపడి నాలుగు పూరి గుడిసెలు కాలిపోయిన సంఘటన శుక్రవారం ఎర్రావారిపాళెం మండలంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు. మండలంలోని చింతగుంట పంచాయతీ, సంక్రాంతి గుట్ట యానాది కాలనీలో గిరిజనులు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని పొయ్యి ఆర్చకుండానే తమ పనులకు వెళ్లారు. దీంతో పొయ్యిలోని నిప్పురవ్వలు గాలికి ఎగిరి గుడిసెల మీద పడడంతో నిప్పంటుకుని నాగరాజు, అంజి, చౌడేశ్వరిలకు చెందిన పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో ఉన్న మంచాలు, దస్తులు, నగదు, వంట పాత్రలు, ఒక ద్విచక్ర వాహనం, మూడు టీవీలు కాలి బూడిదైపోయాయి. దీంతో సుమారు రూ. 3 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించింది. ప్రమాద సమయంలో స్థానికంగా ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచి విజయలక్ష్మి తక్షణ సాయం కింద బాధితులకు దుస్తులు, వంట పాత్రలతో పాటు ఒక్కో కుటుంబానికి రూ. 3వేల నగదు అందజేశారు. అలాగే టిడిపి నాయకురాలు రాజేశ్వరి రూ. 5వేలు అందజేశారు. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ దస్తగిరయ్య పరిశీలించారు.