రాష్ట్రంలో డిమాండ్ తగ్గట్టుగా ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రజలకు కరెంటు అందిస్తున్నాయని, ఇకమీదట కూడా ఎంత అవసరమైనా విద్యుత్‌ను సరఫరా చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులతో శుక్రవారం ఆయన వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా, రికార్డు స్థాయిలో 12,653 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో 251 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతున్నా.. విద్యుత్ కోతలు విధించడం లేదని తెలిపారు. భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడం కోసం విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.