నీటి కోసం అమ్మ పడుతోన్న కష్టాలను చూసి చలించిపోయిన ఓ బాలుడు.. తన వయసుకు మించిన సాహసం చేశాడు. ఇంటి ఆవరణలోనే బావి తవ్వకం ప్రారంభించాడు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ మధ్యలో కేవలం పావుగంట మాత్రమే విరామం తీసుకుని బావి తవ్వాడు. బాలుడి ప్రయత్నం ఫలించి ఐదు రోజుల్లోనే నీళ్లు పడడంతో తల్లి కష్టం తప్పించానని సంబరపడిపోయాడు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన బాలుడు ప్రణవ్ రమేశ్ సాల్కర్ చుట్టుపక్కల గ్రామాల్లో హీరోగా మారాడు. పొరుగున ఉన్న గ్రామాలతో పాటు ప్రణవ్ స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు కూడా బావిని చూడటానికి వస్తున్నారు.
ముంబయికి 120 కిలోమీటర్ల దూరంలో ఉండే మారుమూల ప్రాంతమైన కెల్వె గ్రామంలో సరైన నీటి వసతులు లేవు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలకు సమీపంలోని ఉన్న ఓ నది ఆధారం. మిగతా మహిళలతో పాటు ప్రణవ్ తల్లి కూడా దగ్గర్లోని నదికి వెళ్లి నీటిని తీసుకుని వచ్చేది. వేసవిలో వారి కష్టాలు మరింత ఎక్కువగా ఉండేవి. రోజూ ఉదయాన్నే నీళ్ల కోసం అంతదూరం వెళ్లడం చూసి ప్రణవ్ చలించిపోయాడు. ఆమె కష్టాన్ని తీర్చాలని భావించి.. తమ గుడిసె పక్కనే బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక్కడే కష్టపడి తవ్వడం మొదలు పెట్టి, ఐదు రోజుల్లో పూర్తి చేశాడు.
మధ్యాహ్నం భోజనానికి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే విరామం తీసుకునేవాడని ప్రణవ్ తల్లి దర్శన తెలిపింది. బావిలో నీళ్లు పడడంతో అమ్మ కష్టాన్ని తప్పించానని ప్రణవ్ సంబరపడిపోతున్నాడు. స్థానిక ఆదర్శ్ విద్యా మందిర్‌లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ప్రణవ్.. తాను చేసిన పనితో సెలబ్రిటీగా మారిపోయాడు. తన స్కూలు టీచర్ కూడా బావిని చూడటానికి తన ఇల్లు వెతుక్కుంటూ వచ్చిందని ప్రణవ్ తెలిపాడు. ప్రణవ్ కష్టాన్ని వివరించేలా అతడి స్నేహితులు ఓ బోర్డు తయారుచేసి బావి ఒడ్డున నిలబెట్టారు. అటు, స్పందించిన పంచాయతి సమితి.. ప్రణవ్ ఇంట్లో కుళాయి ఏర్పాటు చేసింది. ప్రణవ్‌కు మరింత సాయానికి సమితి ముందుకు వచ్చింది.
దీనిపై ప్రణవ్ మాట్లాడుతూ.. ఇకపై నీళ్ల కోసం నదికి రోజూ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదని నేను సంతోషంగా ఉన్నానని అన్నాడు. ఇంటి అవసరాల కోసం సమీపంలోని నది నుంచి తన తల్లి రోజూ నీళ్లు తీసుకొచ్చేదని చెప్పాడు. అదే తనను బావి తవ్వడానికి ప్రేరేపించిందని వివరించాడు. అయితే, ప్రణవ్ ఇంతకు ముందు తన ఇంటికి బైక్ బ్యాటరీ సాయంతో లైట్లు ఏర్పాటు చేశాడు.