వేసవి కాలం వస్తే ఎండ వేడిమిని తట్టుకోలేక కొందరు రాత్రి సమయాల్లో తలుపులు తెరిచి పడుకోవడం.. మరికొందరు ఇంటికి తాళం వేసి మిద్దపై పడుకోవడం అలవాటు. ఇలాంటి ఇళ్లనే కొందరు దొంగలు టార్గెట్ చేస్తారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కూడా అదే జరిగింది. ఇంటి తలుపులు తీసి పెట్టి పడుకుంటే దొంగలు డబ్బులు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల్లోనే పోలీసులు ఆ దొంగల్ని అరెస్ట్ చేశారు.
రాజమండ్రి ఆల్కట్ గార్డెన్స్‌కి చెందిన నిమ్మయ్య తాపీ మేస్త్రి. ఆయన తన మనవరాళ్ల పేరుతో పోస్టాఫీసులో డిపాజిట్ చేయడానికి రూ.2.37లక్షలు ఇంట్లోనే ఓ సూట్‌కేసులో దాచాడు. వేసవి కావడంతో ఇంటి తలుపులు తెరిచి నిద్రపోయాడు. తెల్లవారిన తర్వాత చూస్తే డబ్బులు కనిపించలేదు. ఈ నెల 18న ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని కనిపెట్టారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన షేక్ షహీర్, ప్రకాశం జిల్లాకు చెందిన మరో బాలుడిని ఇద్దరినీ ఆదివారం ఐఎల్‌టీడీ కూడలిలో అదుపులోకి తీసుకున్నారు.
ఎవరైనా తలుపులు తెరిచి నిద్రిస్తుంటే.. ఆ ఇళ్లనే టార్గెట్ చేసేవాళ్లని గుర్తించారు. నిందితుల దగ్గర నుంచి రూ.2.03లక్షల డబ్బులు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లోనే ఈ కేసును పోలీసులు క్లోజ్ చేశారు. వేసవికాలం కావడంతో ఇంటి బయట నిద్రపోయేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కాస్త అప్రమత్తంగా ఉండాలని.. విలువైన వస్తువులు, డబ్బుల విషయంలో జాగ్రత్త అవసరమంటున్నారు.