మూడు రాష్ట్రాల్లో 100కుపైగా క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన స్వయం ప్రకటిత నాయకుడిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిక్కు వ్యక్తిలా నటిస్తూ 13 నెలలుగా దాబా నడుపుతున్న దినేశ్ గోపేను ఆదివారం నేపాల్‌లో అరెస్ట్ చేశారు.
ఝార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భమ్‌లో గతేడాది ఫిబ్రవరి 3న గోపే నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) సభ్యులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ నుంచి గోపే చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత నేపాల్ పారిపోయి అంతర్జాతీయ సరిహద్దులోని బిరత్‌నగర్‌లో ధాబా నడుపుతున్నాడు. బీహార్, ఒడిశా, ఝార్ఖండ్‌లోని తమ ఏరియా కమాండర్లకు ఫోన్లు చేసిన తర్వాత గోపే తన మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులను ధ్వంసం చేశాడు.
అయితే, ఝార్ఖండ్ బీజేపీ నేతకు గోపే కాల్ చేయడంతో దొరికిపోయాడు. దానిని ట్రేస్ చేసిన ఎన్ఐఏ అతడు నేపాల్‌లో ఉన్నట్టు నిర్ధారించుకుని అరెస్ట్ చేసింది. కాగా, గోపే దాదాపు రెండు దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్నట్టు ఎన్ఐఏ వర్గాల తెలిపాయి. గోపే నేతృత్వంలోని పీఎల్ఎఫ్ఐ కార్యకర్తల నుంచి రూ. 25 లక్షల విలువైన రద్దు చేసిన కరెన్సీని స్వాధీనం చేసుకున్న తర్వాత 2018లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ గోపేపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఝార్ఖండ్, బీహార్, ఒడిశాలలో హత్యలు, కిడ్నాపులు, బెదిరింపులు, దోపిడీలు, నిధుల సేకరణ వంటి వాటికి సంబంధించి గోపేపై 102 కేసులు నమోదయ్యాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 5 లక్షలు, ఝార్ఖండ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించాయి.