విమాన ప్రయాణాలు ఎంత సౌఖ్యంగా ఉంటాయో కొన్ని సందర్భాల్లో అంతే సంక్లిష్టంగా మారుతుంటాయి. విదేశాల నుంచి సొంత ఊరికి తిరిగొస్తూ విమానంలోనే ఓ వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతానికి చెందిన చెక్కా నూకరాజు (85) తన కుటుంబంతో కలిసి దుబాయ్ లో స్థిరపడ్డాడు. అయితే బంధువుల వివాహం ఉండటంతో ఆయన భార్య, కొడుకుతో కలిసి స్వదేశానికి బయల్దేరాడు. షార్జా నుంచి ఎయిరిండియా విమానంలో వీరు బయల్దేరారు. కాసేపట్లో గన్నవరం (విజయవాడ) విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారనే సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి మొదలయింది. విమానంలోనే ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. ఆయన పరిస్థితిపై విమానంలోని సిబ్బంది విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో, ఆయన కోసం ఎయిర్ పోర్టులో అంబులెన్స్ ను రెడీగా ఉంచారు. అయితే, విమానం ల్యాండ్ అయ్యేలోపలే ఆయన మృతి చెందారు. ఆయనను పరిశీలించిన వైద్య సిబ్బంది అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. దీంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. విదేశాల్లో స్థిరపడిన తమ వ్యక్తి విగతజీవిగా తిరిగిరావడంతో బంధుమిత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.