ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదివారం కీలక ప్రకటన చేస్తా,,,నారా చంద్రబాబు నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 27, 2023, 05:57 PM

రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మహానాడు ప్రత్యేకమైనదని టీడీపీ అధినేత చంద్రబాబు  పేర్కొన్నారు. కేడర్‌లో ఉత్సాహం పెరిగింది.. ఎనర్జీ వచ్చిందన్నారు. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకు పోదామని.. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆయనను తెలుగు జాతి స్మరించుకుంది అన్నారు. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన నాయకుడు...తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. అలాంటి మహానాయకుడికి మనం వారసులం. రాజమహేంద్రవరం...ఎన్టీఆర్ మెచ్చిన నగరం. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు రాజమహేంద్రవరంలో నన్నయ ఇక్కడే నడయాడారు.. కందుకూరి వీరేశిలింగం ఇక్కడే పుట్టారని.. ఇక్కడే కాటన్ నివసించారు.. ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చారన్నారు.


ఇది చారిత్రిక మహానాడు.. ఒకవైపు ఎన్టీఆర్ శతజయంతి.. మరో వైపు 42 ఏళ్ల ప్రయాణం అని గుర్తు చేశారు. తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడదాం అని సంకల్పం తీసుకుందామని.. తెలుగు దేశం పార్టీ జెండా చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తుంది.. పుసుపు రంగు అనేది శుభసూచకం అన్నారు. టీడీపీ పార్టీ ఎంబ్లమ్ లో నాగలి, చక్రం, ఇల్లు పెట్టారని.. రైతులను శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని నాడు నాగలి పెట్టారు.. శ్రమ జీవుల కోసం చక్రం పెట్టారు.. పేదల కోసం ఇళ్లు పెట్టారని వివరించారు. తెలుగు దేశం జెండా... తెలుగు జాతికి అండ అన్నారు. తెలుగు దేశం సింబల్ సైకిల్..ముందు చక్రం అంటే సంక్షేమం.. రెండో చక్రంఅభివృద్ది. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చింది.. దాంతో ఇక దూసుకుపోవడమే అన్నారు.


నాలుగేళ్లలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు.. అరెస్టులు, కేసులు, దాడులకు ఏ ఒక్క నాయకుడు భయపడలేదన్నారు. మాచర్లలో చంద్రయ్యను చంపే సమయంలో అతన్ని జై జగన్ అంటే వదిలేస్తా అన్నారు.. కానీ ప్రాణాలు వదులుకున్నాడు కానీ.. జై జగన్ అనలేదన్నారు. జై తెలుగుదేశం అని ప్రాణాలు విడిచారన్నారు. అందుకే చంద్రయ్య పాడె మోశానని.. కుటుంబ పెద్దగా కార్యకర్తలకు అండగా ఉంటాను.. తోడుగా ఉంటాను అన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొని తెలుగు దేశం కార్యకర్తలు నిలబడ్డారు.. అందరి త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నా.. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అన్నారు. భవిష్యత్ లో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటున్నానని.. ఎన్టీఆర్ శతజయంతి సాక్షిగా.. ఈ మహానాడులో చెపుతున్నాను.. అండగా ఉంటానన్నారు.


రాజమండ్రి టీడీపీ ‘మహానాడు’లో నారా లోకేష్ ఎంట్రీతో ఈలలు కేకలు


సంపద సృష్టించడమే కాదు.. పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ అన్నారు చంద్రబాబు. ఏపీలో సంక్షేమ పథకాలు మొదలు పెట్టిందే తెలుగు దేశం పార్టీ.. రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు రూ.50 హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చామన్నారు. దేశంలో మొదటి సారి పేదలకు పెన్షన్ ఇచ్చిన పార్టీ టీడీపీ అన్నారు. 2014లో రూ.200 పెన్షన్ ఉంటే.. రూ.2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. 2014 తర్వాత వందల సంఖ్యలో పథకాలు అమలు చేశామన్నారు. 2029 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 స్టేట్ చేయాలని పనులు చేశామన్నారు. 2019లో ఒకరు వచ్చారు.. ఎన్నో మాటలు చెప్పి మోసం చేశారన్నారు. అమరావతికి రూపం ఇస్తే.. దాన్ని విధ్వంసం చేశారన్నారు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం లేదన్నారు.


పోలవరం పూర్తి అయ్యి నదుల అను సంధానం జరిగితే మంచి ఫలితాలు వచ్చేవన్నారు చంద్రబాబు. ఒక్క రోడ్డు వేయలేదు.. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. ప్రభుత్వ ఉగ్రవాదంతో ఒక్క పెట్టుబడి రాలేదన్నారు. జగన్ చెప్పిన జాబ్ క్యాలెండర్ లేదు.. జాబ్స్ లేవన్నారు.ఉద్యోగం రావాలి అంటే ప్రత్యేక హోదా కావాలి అని నాడు జగన్ అన్నారని.. 25 మందిని గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తాను అని.. ఇప్పుడు మెడలు దించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. అమ్మఒడి ఒక నాటకం.. నాన్న బుడ్డి వాస్తవం అన్నారు. ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనిషి.. మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారన్నారు.


అందరితో చర్చించిన తర్వాత ఆదివారం మేనిస్టోలో ఫేజ్ 1 ప్రకటిద్దామని ప్రకటించారు. ప్రజలు మెచ్చేలా.. అదిరిపోయే సంక్షేమం చేద్దామన్నారు. రాజమహేంద్రవరం అదిరిపోయింది.. ఆదివారం దద్దరిల్లి పోతుంది అన్నారు. రాష్ట్రంలో ఉండే అందరి చూపూ రాజమండ్రి పైనే.. అన్ని రోడ్లూ రాజమండ్రి వైపే వస్తాయన్నారు. 2024లో ఎన్నికలు వచ్చినా.. అంతకంటే ముందు వచ్చినా సిద్దమేనన్నారు. నిరంతరం సంపద సృష్టించి.. ఆ సంపదను పేదలకు పంచి.. పేదలను ధనికుడిని చేద్దామన్నారు. ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా మార్చే సత్తా తెలుగు దేశం పార్టీకే ఉంది అన్నారు. టెక్నాలజీ ద్వారా కేడర్‌కు.. అధిష్టానానికి గ్యాప్ పోయింది అన్నారు. వచ్చేది కురుక్షేత్రం... ఆ యుద్దంలో వైఎస్సార్‌సీపీ కౌరవ సేనను ఓడిద్దాం.. శాసన సభను గౌరవ సభ చేసి అసెంబ్లీకి వెళదామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com