రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులకు 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంతేకాదు ప్రైమరీ స్కూళ్లలో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిని బిగించేందుకు రూ.352 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. జగన్ సర్కార్ పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఇస్తోందని.. డిజిటల్ విద్యా విధానం- సాంకేతికతతో కూడిన బోధన, అభ్యసనంపై ఫోకస్ పెట్టామన్నారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ ఎడ్యుకేషన్ బాటలో ఉపాధ్యాయులు ముందుండాలి అన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా సంస్కరణలను ఏపీలో అమలు చేస్తున్నామన్నారు మంత్రి. డిజిటల్ బాటలో ప్రపంచమంతా పయనిస్తుందని.. ఏపీ కూడా ముందుండాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని.. అందుకు తగ్గట్టుగానే అద్భుతమైన సంస్కరణలను, పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ‘మన బడి నాడు–నేడు’తో స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి అన్నారు. ప్రధానంగా జగనన్న అమ్మఒడి, మన బడి నాడు–నేడు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశ సంస్కరణల ద్వారా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
పోటీ ప్రపంచంలో ముందు ఉండేందుకు.. ఇప్పుడు డిజిటల్ విద్యాబోధన ద్వారా తరగతిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు మరింత ప్రభావవంతంగా బోధించే అవకాశం వచ్చిందన్నారు. 2024–25 నాటికి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌తో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేలా సన్నద్ధం చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ట్యాబుల కోసం రూ.686 కోట్లు ఖర్చు చేశామన్నారు.