దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) మళ్లీ బతికితే.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సమాధి చేస్తారంటూ మంత్రి జోగిి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్లను చూసి, నేను నిండు నూరేళ్లు జీవించి ఉండేవాడినని ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని.. ఒక క్షణం మళ్లీ ప్రాణం పోస్తే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును అదే వేదికపైనే సమాధి చేస్తానని ఎన్టీఆర్ దేవుడిని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మహానాడు వేదికగా ఆ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి జోగి రమేష్ పై విధంగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తాడేపల్లిలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ..
తామే చెప్పులు వేసి, చిత్రవధ చేసి చంపిన ఎన్టీఆర్‌కు శతజయంతి పేరుతో వాళ్లే దండలు వేసి దండాలు పెడుతున్నారని జోగి రమేష్ ఫైరయ్యారు. వీళ్లంతా మనుషులేనా అని మండిపడ్డారు. బీసీలకు మేలు చేశానని చంద్రబాబు చెబుతున్నారని.. అయితే, ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు.
మహానాడులో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఎన్నికల ప్రణాళికకు విలువే లేదని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల ముందు 600 పైచిలుకు హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. బీసీలను చంద్రబాబు బానిసలుగానే చూసారని.. వారి మేలు కోసం ఏనాడు ప్రయత్నం చేయలేదన్నారు. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు వంటి నాయకులందరి ముందు బీసీలకు మేలు చేశానంటూ చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. బీసీలకు ఆత్మగౌరవం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సాధ్యమైందని మంత్రి జోగి రమేష్ వివరించారు. రాష్ట్రంలో బీసీలంతా తలెత్తుకొని తిరుగుతున్నారంటే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో రాజకీయ, ఆర్థిక, విద్య, ఆరోగ్యపరమైన ప్రతి అంశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఎదుగుదల కనిపిస్తూనే ఉందన్నారు.