ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు జనగ్ సర్కార్ శుభవార్త చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకం విడుదల చేయనున్నారు. అన్నదాతలకు తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది. అలాగే ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. ఈ నెల 30న కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతుల అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేయనున్నారు.
ఈ ఏడాది 52.31 లక్షలమంది రైతులకు తొలి విడతలో పెట్టుబడి సాయంగా రూ.7,500 చొప్పున రూ.3,934.25 కోట్లను ముఖ్యమంత్రి ఖాతాల్లో జమ చేస్తారు. పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది కూడా రైతు భరోసా అందుకునే రైతుల సంఖ్య పెరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కింద అర్హులైన రైతులకు ఏటా మూడువిడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. విషయం తెలిసిందే. మే నెలలో రూ.7,500.. రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడోవిడతగా జనవరిలో రూ.2 వేలు ప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ నెలలో అందించనున్న సాయంతో కలిపితే.. ఈ నాలుగేళ్లలో సగటున 52.30 లక్షల మందికి వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.30,996.34 కోట్ల పెట్టుబడి సాయం అందిచినట్లవుతుంది.
రైతు భరోసాతో పాటూ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు కూడా సాయం అందిస్తున్నారు. సీజన్ ముగియకముందే ఇన్‌పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) నేరుగా వారి అకౌంట్‌లలోనే జమ చేస్తూ బాధిత రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో మాండూస్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి 91,237 మంది రైతులకు రూ.76.99 కోట్ల నష్టపరిహారాన్ని ఫిబ్రవరిలో అందజేశారు.
అకాల వర్షాలకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 78,510 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో 59,230 ఎకరాల్లో వ్యవసాయ పంటలు.. 19,280 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ మేరకు పంటలు దెబ్బతిన్న 48,032 మంది రైతులకు రూ.46.39 కోట్ల పంట నష్టపరిహారాన్ని ఈ నెల 30న ముఖ్యమంత్రి జమచేయనున్నారు. ఈ నాలుగేళ్లలో 22.70 లక్షల మంది రైతులకు రూ.1,958.18 కోట్ల పంట నష్టపరిహారం అందించినట్లు అవుతుంది.
రైతు భరోసాకు సంబంధించి.. గతేడాది 49,26,041 మంది భూ యజమానులు ఉంటే.. 1,23,871 మంది కౌలురైతులు, 91,031 మంది అటవీ భూ సాగుదారులు లబ్ధిపొందారు. ఈ ఏడాది తొలి విడత సాయం కోసం అర్హత పొందిన 52,30,939 మందిలో భూ యజమానులు 50,19,187 మంది కాగా.. అటవీ భూ సాగుదారులు 91,752 మంది, భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులు 1.20 లక్షల మంది ఉన్నారు.