తెలుగు దేశం పార్టీ పెద్ద పండుగ మహానాడుకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వేదికైంది. శని, ఆదివారాల్లో ఈ వేడుక జరగనుంది.. మహానాడుకు వచ్చే అతిథుల కోసం టీడీపీ ఫుడ్ మెనూ సిద్దం చేసింది. మహానాడు ఫుడ్ కమిటీ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూలు మెనూ సిద్ధం చేశారు. తొలిరోజు లక్ష మంది, రెండోరోజు 15లక్షల మంది వచ్చే అవకాశం ఉందని.. వారందరికి ఏర్పాట్లు చేశారు.
మహానాడుకు హాజరయ్యే పార్టీ నేతలు, కేడర్ కోసం నోరూరించే రుచులు, పసందైన వంటకాలు సిద్ధం చేశారు. గోదావరి వంటకాలను తెలుగు తమ్ముళ్లు టేస్ట్ చూడబోతున్నారు. విజయవాడకు చెందిన అంబికా క్యాటరింగ్ మహానాడు వంటకాలను సిద్దం చేస్తుంది. నాలుగు రోజుల ముందే కిలారు వెంకట శివాజీ పర్యవేక్షణలో 1,500 మంది వంట నిపుణులు పనుల్లో బిజీ అయ్యారు. శనివారం (27న) మహానాడు ప్రతినిధుల సభకు వచ్చేవారికి టిఫిన్ మెనూలో.. ఇడ్లీ, వడ, పొంగల్, టమాటా బాత్, పునుకులు, మైసూర్ బజ్జీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబారు వడ్డిస్తారు.
శనివారం మధ్యాహ్నం, రాత్రి భోజనంలో.. స్వీట్లలో కాకినాడ కాజా, తాపేశ్వరం గొట్టం కాజా, యాపిల్ హల్వా, జిలేబీ వడ్డిస్తారు. వెజ్ బిర్యానీ, బంగాళదుంప కుర్మా, పెరుగు చట్నీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, బెండకాయ వేరుశనగ, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, గుత్తి వంకాయ, గోంగూర, టమాటా మునక్కాయ, మామిడికాయ ఆవకాయ, దోస ఆవకాయ, సాంబారు, మజ్జిగ పులుసు, పెరుగులు ఉన్నాయి.
ఆదివారం (మే 28న) బహిరంగ సభ ఉంది.. పది లక్షల మందికి పైగా వస్తుండటంతో.. శనివారం ఉదయం మెనూనే కొనసాగిస్తున్నారు. కాకపోతే మధ్యాహ్నం, రాత్రి భోజనంలో మార్పులు చేశారు. మెనూలో.. సాంబారు రైస్, చక్కెర పొంగలి, పెరుగన్నం పెడతారు. భోజనాల దగ్గర ఏకంగా 10 లక్షల నీటి సీసాలు, 10 లక్షల మంచినీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.
మరోవైపు మహానాడుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం తాపేశ్వరం నుంచి 30 వేల కాజాలు సిద్ధం చేశారు. టీడీప నేతలు కాజాకు ప్రసిద్ధిగాంచిన తాపేశ్వరంలోని శ్రీవేంకటేశ్వర స్వీట్ స్టాల్ అధినేత బద్రి వెంకటరమణకు ఇప్పటికే ఆర్డర్ ఇవ్వగా రెడీ అయ్యయి. దాదాపు 1300 కేజీల కాజాలతోపాటు ముఖ్య అతిథులకు రుచిచూపేందుకు మరో 100 కేజీల నేతి కాజా సిద్ధం చేశారు. వీరు గతేడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు 50 వేలకుపైగా కాజాలు అందించారు.