గుంటూరు జిల్లాలో తెనాలి బిక్షావతి బజారుకు చెందిన సాయికుమార్ స్థానికంగా ఓ జ్యువెలరీ షాపులో పని చేస్తున్నాడు. తెనాలి చెంచుపేటకు చెందిన ఉమాలక్ష్మి కూడా అదే ప్రాంతంలో మరోషా షాపులో పని చేస్తోంది. ఆమెకు గతంలో వివాహమై ఇద్దరు పిల్లలున్నారు.. భర్తతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో సాయికుమార్, ఉమాలక్ష్మి మధ్య పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
ఈ వివాహానికి సాయకుమార్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఉమాలక్ష్మి తరఫు బంధువులు ఓకే చెప్పడంతో గురువారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం తిరిగి తెనాలి వచ్చి.. అక్కడి నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లాలనుకున్నారు. సాయికుమార్ తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మానాన్నలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. తాను శ్రీశైలం వెళుతున్నానని చెప్పాడు. తాను తిరగొచ్చేలోపు అమ్మానాన్నలకు ఎలాగోలా నచ్చచెప్పి ఒప్పించమని పెద్దమ్మను అడిగాడు.
సాయికుమార్, ఉమాలక్ష్మిలు గుంటూరులో బస్సు ఎక్కేందుకు బైక్‌పై రాత్రి సమయంలో బయలు దేరారు. నారాకోడూరు బుడంపాడు మధ్యకు రాగానే.. వీరి బైక్ గుంటూరు నుంచి వస్తున్న మరో బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయికుమార్ అక్కడికక్కడే చనిపోగా.. ఉమాలక్ష్మికి, గుంటూరు నుంచి వస్తున్న చేబ్రోలుకు చెందిన వెంకటేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన కొన్ని గంటల్లోనే సాయికుమార్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.