గత 2019లో వెలుగు చూసిన ఈ కొవిడ్ వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా అల్ల కల్లోలం సృష్టించింది. కొన్ని దేశాలు ఈ మహమ్మారి నుంచి బయటపడి.. ముందుకు సాగుతుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ప్రపంచ దేశాల్లో ఈ కొవిడ్ ధాటికి కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటికీ కొంతమంది పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరోసారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే అక్కడి పరిస్థితులపై అంతర్జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వెలువడుతున్నాయి. మే నెల చివరి నాటికి చైనాలో వారానికి 4 కోట్ల కేసులు నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తీవ్రత జూన్‌లో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని హెచ్చరించారు. జూన్‌లో వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ కారణంగా ఏప్రిల్ నుంచి చైనాలో కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. మే నెల ఆఖరు నాటికి చైనాలో వారానికి 4 కోట్ల కేసులు నమోదవుతాయని నిపుణులు అంచనా చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక అది మరింత తీవ్రంగా మారి జూన్ నెలాఖరు నాటికి వారానికి 6.5 కోట్ల మందికి కరోనా సోకుతుందని పేర్కొన్నాయి. చైనాలో కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు తీసుకువచ్చిన జీరో కొవిడ్ విధానాన్ని.. 2022 డిసెంబరులో జిన్‌పింగ్ సర్కార్ తొలగించింది. దాని తర్వాత అడపాదడపా కొత్త వేవ్‌లు వచ్చినా.. ఈ స్థాయిలో ఉద్ధృతి కనిపించడం ఇప్పుడేనని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ విస్తరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు పెరగకుండా ఉండేందుకు కొవిడ్ టీకాలు వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తున్నారు. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్లకు రోగనిరోధక శక్తిని తగ్గించే సామర్థ్యం ఉండటంతో కేసుల్లో భారీగా పెరుగుతున్నట్లు చెప్పారు. దీంతో ఎక్స్‌బీబీ వేరియంట్లను ఎదుర్కొనే టీకాలను అభివృద్ధి చేస్తున్నామని చైనీస్ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ నన్షాన్ చెప్పిన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పటికే రెండు టీకాలను తీసుకురాగా.. త్వరలోనే మరో నాలుగు కొత్త వ్యాక్సిన్లకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్నప్పటికీ తీవ్రత తక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించారు. గతేడాది డిసెంబర్‌లో చైనా జీరో కొవిడ్ పాలసీని రద్దు చేసిన తర్వాత దాదాపు 85శాతం మంది జనాభా అనారోగ్యానికి గురైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.