అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ లోకనాథం, జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి తెలిపారు. పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ లోకనాథం అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏఈ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ప్రతి ఇంటికీ నగదు రహితంగా విద్యుత్ కనెక్షన్లు అందజేస్తామన్నారు. పాకాల సర్పంచ్ ఎస్. కస్తూరి పాకాల పంచాయతీ పేరుపై విద్యుత్ బిల్లులు వస్తున్నాయని తెలిపారు. వాటిని సరిచేయాలని సూచించారు. అడల్డ్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రభుత్వం త్వరలోనే భారత నూతన అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించనుందని తెలిపారు.
హౌసింగ్ ఏఈ మహేష్ మాట్లాడుతూ మండలంలో 1800 ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో 638 ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. ఏపీఎం కోమలాదేవి మాట్లాడుతూ మండలంలో 426 డ్వాక్రా సంఘాలు ఉన్నాయని, వాటికి 6వ విడతలో రూ. 4. 26 కోట్ల నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఎంపీడీఓ రమేష్ బాబు, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ నందకిషోర్, పీఆర్ ఏఈ నాగేంద్ర, ఏపీఓ దీప, ఏఓ పుష్పావతి, సింగిల్ విండో ప్రెసిడెంట్ మునీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.