రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ ఏడున రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1 లో ఈ భేటీ జరగనుంది. ఈ కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆదివారం వరకు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా.. పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆదివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అమిత్ షాతో సుమారు 40 నిమిషాలు భేటీ అయిన జగన్.. ఇప్పటికీ పరిష్కారం కాని పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని జగన్ కోరారు. ఢిల్లీలో ఏపీ భవన్ సహా.. షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజనపై కూడా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని కోరారు. ఏపీ విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని.. వెంటనే ఈ బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో పర్యటనలోని అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.