విశాఖ నగరంలో జనసేన, వైసీపీల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుని ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక సత్యం కూడలిలో వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆదివారం నిరసనకు దిగారు. వైసీపీ నేతలు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
వివరాల్లోకి వెళితే.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కించపరుస్తూ సత్యం కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని జనసేన నాయకులు, కార్యకర్తలు పట్టుబట్టారు. పలువురు కార్యకర్తలు ఫ్లెక్సీ పైకెక్కి చింపేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. అంతేకాకుండా జగన్‌పైకి పవన్‌కల్యాణ్ బాణం వదులుతున్న చిత్రంతో రూపొందించిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. దీంతో జనసేన నాయకులను పోలీసులు ద్వారకా స్టేషన్‌కు తరలించారు. వారికి మద్దతుగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి.
అదే సమయంలో వైసీపీ ఉత్తర సమన్వయకర్త కేకేరాజు, పార్టీ కార్పొరేటర్లతో కలిపి జనసేన నేతలపై ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్‌కు వచ్చారు. ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పాటు బాహాబాహీకి దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం వైసీపీ వర్గం అక్కడి నుంచి వెళ్లిపోగా జనసేన నాయకులను పోలీసులు పంపించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని, న్యాయం కోసం వచ్చిన తమను చొక్కాలు పట్టుకొని లాగడమేమిటని వారు ప్రశ్నించారు. పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు. ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.