నాలుగేళ్ల కిందట మరణించిన ఓ క్రైస్తవ సన్యాసిని మృతదేహం ఇప్పటికీ చెక్కుచెదరకపోగా.. కుళ్లిన సంకేతాలు కనిపించకపోవడం గమనార్హం. దీంతో దానిని చూసేందుకు భారీగా క్రైస్తవ సన్యాసినులు, సందర్శకులు తరలివస్తున్నారు. అమెరికాలోని మిస్సౌరీలో ఈ అద్భుతం వెలుగుచూసింది. అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. గోవెర్ పట్టణంలో క్యాథలిక్ సన్యాసిని సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ 95 ఏళ్ల వయస్సులో 2019 మే 29న మరణించారు. దీంతో ఆమె మృతదేహాన్ని చెక్క శవపేటికలో ఉంచి క్రైస్తవ మత ఆచారాల ప్రకారం ఖననం చేశారు.
సిస్టర్ విల్హెల్మినా 1995లో బెనెడిక్టైన్స్ ఆఫ్ మేరీ, క్వీన్ ఆఫ్ అపోస్టల్స్ ఆర్డర్‌ను స్థాపించినట్టు ది కాన్సాస్ సిటీ డియోసిస్ సెయింట్ జోసెఫ్ వెల్లడించింది. కాగా, మత ఆచారం ప్రకారం ఆమె మృతదేహాన్ని ప్రార్థనా మందిరంలోని బలిపీఠం కిందకు అవశేషాలను తరలించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మే 18న ఖననం చేసిన ప్రదేశంలో శవపేటికి వెలికి తీశారు. లోపలి ఉన్న భౌతికకాయం కనీసం చెక్కుచెదరకపోవడంతో ఆశ్చర్యపోయారు. దీంతో ప్రార్థనా మందిరంలోని బలిపీఠం కిందకు తరలించాలని నిర్ణయించారు.
లాంకాస్టర్ మృతదేహం అసాధారణంగా సంరక్షించారు. వాస్తవానికి కొందరు దీనిని అద్భుతం అని పిలుస్తున్నారు. కానీ, ఆమెకు ఎంబాల్మ్ చేయనప్పటికీ అలాగే ఉండటం గమనార్హం. అజ్ఞాత పరిస్థితి గురించి నన్ ఒకరు మాట్లాడుతూ.. ‘సిస్టర్ విల్హెల్మినా మృతదేహానికి ఎంబాల్మింగ్ చేయకుండా సాధారణ చెక్క శవపేటికలో ఖననం చేయడంతో ఆస్థిపంజరం మాత్రమే ఆశించాలని స్మశానవాటిక సిబ్బంది మాకు చెప్పారు’ అని తెలిపారు.
‘సమాధి తవ్వినప్పుడు ఆమె ముఖంపై పడిన ధూళి ముఖ్యంగా కుడి కన్నుపైకి నెట్టబడింది.. కాబట్టి మేము దానిపై మైనపు ముసుగును ఉంచాం... కానీ ఆమె కనురెప్పలు, వెంట్రుకలు, కనుబొమ్మలు, ముక్కు, పెదవులు అన్నీ సాధారణంగా ఉన్నాయి..’ అని వివరించారు. కాథలిక్కుల్లో మనిషి మరణం తర్వాత సాధారణ క్షీణతను నిరోధించే శరీరం చెడిపోయినదిగా పరిగణిస్తారు. కాథలిక్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ‘నాశనరహితమైన పరిశుద్ధులు శరీరం పునరుత్థానం, రాబోయే జీవితం సత్యానికి సాక్ష్యమిస్తారు’. మరోవైపు, ఈ వార్త గురించి తెలియడంతో సిస్టర్ విల్హెల్మినా మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. చాలామంది దీనిని 'మిరాకిల్ ఆఫ్ మిస్సౌరీగా అభివర్ణిస్తున్నారు. ‘దయచేసి సిస్టర్ శరీరాన్ని ముఖ్యంగా ఆమె పాదాలను తాకడం పట్ల సున్నితంగా ఉండండి’ అని అక్కడ ఓ బోర్డును ఏర్పాటు చేశారు. మే 29 వరకూ సందర్శనకు అనుమతించినట్టు చర్చి వర్గాలు వెల్లడించాయి.