ఓ దొంగ తీరు ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. మహిళ మెడలో గొలుసు కొట్టేసిన ఇద్దరు దొంగలు.. పోలీసులు వెంబడించడంతో వారి తప్పించుకోడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తాము దొంగతనం చేయలేదని నిరూపించుకోడానికి చోరీ చేసిన గొలుసును ఒకడు మింగేశాడు. కానీ, అది ఛాతి భాగంలో ఇరుక్కుపోవడంతో తనను రక్షించాలని పోలీసులను వేడుకున్నాడు. విస్తుగొలిపే ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాంచీలోని దిబ్దిహ్ వంతెన సమీపంలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు దొంగలు.. ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేసి బైక్‌పై పరారయ్యారు.
బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో కొద్ది దూరంలో ఉన్న పోలీసులు.. దొంగలను వెంబడించారు. కిలోమీటరు దూరం ఛేజింగ్ చేసి ఇద్దర్నీ దొరకబుచ్చుకున్నారు. అయితే, ఊహించని విధంగా దొంగతనం చేయలేదని నిరూపించుకోడానికి చోరీ చేసిన గొలుసును సల్మాన్ మింగేశాడు. అయితే, దీనిని గమనించిన పోలీసులు.. ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. వెంటనే రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రికి తరలించారు. సల్మాన్‌ను పరీక్షించిన వైద్యులు.. ఛాతీ భాగంలో బంగారు గొలుసు ఇరుక్కుపోయినట్లు గుర్తించారు.
ఎక్కువసేపు గొలుసు అక్కడ అలాగే ఉంటే ఇన్‌ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో తనను కాపాడమని పోలీసులను సల్మాన్ వేడుకుంటున్నాడు. గత కొద్ది రోజులుగా ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా సల్మాన్, జాఫర్ పలు చోరీలకు పాల్పడ్డారు. నిందితులు దొంగతనానికి వాడిన బైక్ కూడా చోరీ చేసిందే కావడం గమనార్హం. ప్రస్తుతం రిమ్స్‌లో ఉన్న సల్మాన్‌కు గ్యాస్ట్రోస్కొపీ, ఎండోస్కొపీ లేదా సర్జరీ చేసి గొలుసును బయటకు తీస్తామని రాంచీ సిటీ ఎస్పీ వెల్లడించారు. మరో నిందితుడు జాఫర్‌ను స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.