ఏపీపై కేంద్రం ఉధారత చాటుకొందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకేసారి రూ. 10,400 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తన ఉదారతను చాటుకుందని ఆయన అన్నారు. ఈ మేరకు మంగళవారం గుంటూరులో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీ బాస్‌లా మారారని చెప్పారు. 2014లో బలహీనమైన దేశాల జాబితాలో ఉండేది.. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలో ఐదో బలమైన దేశంగా ఎదిగిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన సుభిక్షంగా సాగిందన్నారు.
ఆరున్నర దశాబ్దాల కాలంలో భారతదేశం సాధించ లేని ఎన్నో అద్భుత విజయాలు మోదీ ప్రభుత్వం సాధించిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కరోనా సమయంలోనూ ఆత్మ నిర్భర భారత్ ద్వారా మన సత్తా చూపించామన్నారు. ప్రపంచానికి మేడ్ ఇన్ ఇండియా వాక్సిన్ అందించామని గుర్తు చేశారు. ఇక, మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశంగా భారత్ ఎదిగిందన్నారు. కోవిడ్ సమయంలో 100 దేశాలకు పైగా మందులు అందించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.
ఈ దేశంలో వాక్సిన్ తయారు కాకపోతే కొన్ని కోట్ల ప్రాణాలు ప్రమాదంలో పడేవని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రెండున్నరేళ్లలో పార్లమెంటు ఉభయ సభల భవనాలను నిర్మించిన చరిత్ర మోదీ నాయకత్వానిదని చెప్పారు. 10 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ ఖాయమన్నారు. తీవ్రవాద చొరబాట్లను అరికట్టినది మోదీ ప్రభుత్వమని తెలిపారు. కోవిడ్ సమయంలోనే కాకుండా, పలు దేశాల్లో యుద్ధాల సమయంలోనూ ప్రజలను రక్షించి తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వమని పేర్కొన్నారు.
గత తొమ్మిదేళ్లలో 74 కొత్త ఐర్పోట్లను నిర్మించామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం కింద రూ. 55 వేల కోట్ల నిధులను ఇచ్చినట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రానికి 22 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇక, ఇటీవలే ఏపీకి ప్రత్యేక నిధులు ఇచ్చారని కేంద్రంపై ప్రశంసలు కురిపించారు. అలాగే, చారిత్రాత్మక పార్లమెంటు భవన ప్రారంభానికి రాజకీయ పార్టీల నేతలు రాకపోవడం వాళ్ల సంకుచిత మనసును తెలియజేస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు.