ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి మంగళవారంతో నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏట అడుగుపెట్టారు. కానీ ఆ ఉత్సాహం పాలకపక్షమైన వైసీపీలో ఏమాత్రం కనిపించలేదు. ఈ నాలుగేళ్లలో తామేం సాధించిందీ చెప్పుకోవడానికి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీకి, ప్రభుత్వానికి ఇదే సరైన సమయం. కానీ సీఎంవోలో గానీ, వైసీపీ కేంద్ర కార్యాలయంలో గానీ, ఆ పార్టీ జిల్లా కార్యాలయాల్లో గానీ నేతల్లో జోష్ కనిపించలేదు. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సహజంగా ఒక ప్రభుత్వం నాలుగేళ్ల పాటు పాలించాక.. తాము అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మీడియా ద్వారా ప్రజలకు సందేశాన్ని చేరవేయడం చూస్తుంటాం. అయితే జగన్ యథాప్రకారం మీడియా ముందుకు రాలేదు. మంగళవారం విజయవాడలోని నిర్మలా సదన్‌లో అనాథలు, దివ్యాంగులతో భార్య భారతీరెడ్డితో కలసి గడిపారు. తర్వాత సీఎంవోలో నాలుగేళ్ల పాలన పూర్తిచేసి ఐదో ఏట అడుగుపెట్టినందుకు సీఎస్ జవహర్‌రెడ్డి, సీఎంవో ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు కె.ధనుంజయరెడ్డి, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తా ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అభినందించారు. ఇక మంత్రులెవరూ నాలుగేళ్ల పాలనపై మాట్లాడలేదు. వైసీపీ సీనియర్ నేతలదీ అదే దారి. వీరంతా మహానాడులో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ మాట్లాడారు. కాగా.. తన నాలుగేళ్ల పాలనపై ఎట్టకేలకు జగన్ మంగళవారం రాత్రికి స్పందించారు. అది కూడా ట్విటర్‌లోనే కావడం గమనార్హం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98శాతం అమలు చేశానన్నారు. ‘దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. నాపై ఎంతో నమ్మకంతో మీరు(ప్రజలు) ఈ బాధ్యతను అప్పగించారు’ అని రాత్రి 8.44గంటలకు ట్వీట్ చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని, సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలందరి ఆశీస్సులూ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కాంక్షించారు.