దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బుధవారం ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అనినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆపరేషన్ అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టుకు వివేకా కూతురు సునీతారెడ్డి మెమో దాఖలు చేయడం ఇప్పుడు కీలకంగా మారింది.
అనినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇటీవల హైకోర్టులో మూడు రోజుల పాటు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని, గుండె కవాటాలు మూసుకుపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నట్లు అవినాష్ రెడ్డి తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నందున అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు కొద్దిరోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సునీతా కోర్టుకు తాజాగా మెమో సమర్పించారు.
అవినాష్ రెడ్డి తల్లికి అసలు ఆపరేషన్ జరగలేదని, మీడియాలో కథనాలు కూడా వచ్చాయని సునీత మెమోలో పేర్కొన్నారు. ఆపరేషన్ ప్రక్రియ జరుగుతుందంటూ అవినాష్ రెడ్డి తరపు లాయర్ చేసిన ప్రకటన తప్పు అని పొందుపర్చారు. కోర్టుకు అబద్ధం చెప్పినందుకు అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆపరేషన్ జరిగిందని నిర్ధారించడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. దీంతో సునీతా తరపు లాయర్ ఇచ్చిన మోమోను న్యాయమూర్తి తీసుకున్నారు.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి భారీ ఊరట కలిగింది. కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి శనివారం సీబీఐ ముందు విచారణకు హాజరుకావాలని, విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని సూచించింది. రూ.5 లక్షల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించాలని సూచించింది. ఇప్పటికే ఈ కేసులో అవినాష్‌ను ఏడుసార్లు సీబీఐ విచారించింది. కానీ అవినాష్ ఎలాంటి సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ ఆరోపిస్తోంది. తమ విచారణకు సహకరించడం లేదని ఇటీవల హైకోర్టుకు కూడా తెలిపింది.
అవినాష్ రెడ్డికి కస్టోడియల్ విచారణ అవసరమని ఇటీవల హైకోర్టులో సీబీఐ వాదించింది. ఆయన నుంచి అనేక వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపింది. కానీ సీబీఐ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.