ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం గురించి మరో ఆసక్తిర వార్త బయటకు వచ్చింది. నిద్రలేమి రుగ్మతతో బాధపడుతున్న ఆయన.. ఆల్కహాల్, ధూమపానానికి బానిసగా మారినట్టు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్ఐఎస్)ను ఉటంకిస్తూ.. నిద్రలేమితో బాధపడుతున్న అత్యున్నత స్థాయి వ్యక్తుల కోసం ఉత్తర కొరియా అధికారులు తీవ్రంగా విదేశీ వైద్య సమాచారాన్ని సేకరిస్తున్నారని, వాటికి చికిత్స చేయడానికి ఉపయోగించే జోల్పిడెమ్ వంటి మందుల సహ వివరాలను సేకరిస్తున్నారని నివేదించింది.
ఎన్ఐఎస్ సమాచారాన్ని దక్షిణ కొరియా అధికార పీపుల్ పవర్ పార్టీ నేత, పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ యూ సంగ్ బుమ్ మీడియాతో సంక్షిప్తంగా పంచుకున్నారు. మార్లబోరో, డన్‌హిల్ సహా ప్రముఖ విదేశీ సిగరెట్లతో పాటు మద్యం తాగేటప్పుడు సంప్రదాయంగా వినియోగించే స్నాక్స్‌ను ఉత్తర కొరియా ఇటీవల భారీగా దిగుమతి చేసుకుందని అన్నారు.
అంతేకాకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు తాజా ఫోటోలను కృత్రిమ మేధస్సు విశ్లేషణను ఉటంకిస్తూ.. కిమ్ కూడా బరువు పెరిగినట్లు కనిపిస్తోందని యూ అన్నారు. ఆయన ప్రకారం.. ఉత్తర కొరియా నాయకుడి బరువు 140 కిలోలకు పైగా ఉంటుందని అంచనా. న్యూ యార్క్ పోస్ట్‌తో యూ మాట్లాడుతూ.. ‘కిమ్ మద్యపానం, ధూమపానంపై ఆధారపడటం ముఖ్యంగా నిద్రలేమి రుగ్మతతో బాధపడుతున్నారనడానికి బలమైన ఆధారమని చెప్పారు. ‘మే 16న బయటకు వచ్చినప్పుడు కళ్లచుట్టూ స్పష్టమైన నల్లటి వలయాలతో ఆయన అలసిపోయినట్లు కనిపించాడు’ అని పేర్కొన్నారు.
కిమ్ నిద్రలేమి చికిత్స కోసం జోల్పిడెమ్ వంటి మందులను సమకూర్చుకుంటున్నారని తెలిపారు. అలాగే, ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కిమ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆహార కొరతతో పాటు ఆహారధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని యూ చెప్పారు. దేశవ్యాప్తంగా ఆకలి బాధతో నేరాలు, ఆత్మహత్యలు, మరణాలు అధికంగా నమోదవుతున్నట్టు పేర్కొన్నారు.
మరోవైపు, ఇటీవల నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఉత్తర కొరియా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో త్వరలోనే మరోసారి ప్రయత్నిస్తామని పేర్కొంది. ఈ సంఘటనపై ఆందోళనకు గురైన దక్షిణ కొరియా.. అత్యవసర హెచ్చరికలు చేసింది. ఉత్తర కొరియా అధినేత ఈ ప్రయోగాన్ని గమనించే అవకాశం ఉందని దక్షిణ కొరియా గూఢచారి సంస్థ చట్టసభ సభ్యులకు తెలిపింది. ఈ ఉపగ్రహ శకలాలు సముద్రంలో కూలిపోయినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa