వైయస్‌ఆర్ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను పటిష్టపరుస్తూ రైతన్నలకు మంచి జరిగించాలనే తపన, తాపత్రయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని, రైతులకు అండగా నిలిచి గ్రామస్వరాజ్యం తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి ఆర్బీకే సెంటర్‌లో యంత్రాలకు రూ.15 లక్షలు కేటాయించామని, రైతులకు ఏం అవసరమో వారినే అడిగి అందజేస్తున్నామన్నారు. అతితక్కువ అద్దెతో యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. 15 రోజుల ముందుగానే యంత్రాలను బుక్ చేసుకునేలా వైయస్‌ఆర్ యంత్రసేవ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్ వద్ద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు.