ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా వాటికన్ సిటీ చర్చి వద్ద ఓ వ్యక్తి తన ఒంటిపై బట్టలు విప్పి నిరసన తెలియజేయడం కలకలం రేగింది. స్థానిక కాలమాన ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చి వద్ద గుర్తుతెలియని వ్యక్తి తన వీపుపై ఉక్రెయిన్ పిల్లలను రక్షించాలని పెయింటింగ్ వేసుకుని నిరసన తెలిపాడు. చర్చి బలిపీఠం వద్ద నగ్నంగా నిరసన తెలిపిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగ్నంగా ఉన్న అతడి ఫోటోలు, వీడియోలను పర్యాటకులు తీసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వాటికన్ వర్గాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి వేలిగోళ్ల నుంచి శరీరంపై గాయాలతో ఉన్నాడని రాయిటర్స్ నివేదించింది. అతడ్ని అదుపులోకి తీసుకున్న వాటికన్ గార్డులు.. ఇటలీ పోలీసులకు అప్పగించారు. అతడు ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు. గురువారం మధ్యాహ్నం చర్చిని మూసివేయడానికి కొద్ది క్షణాల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. 2016లో సెయింట్ పీటర్స్ బాసిలికా కాంప్లెక్స్‌లో కేవలం బ్యాక్‌ప్యాక్‌ను ధరించి ఇద్దరు ట్రైనర్లతో నగ్నంగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అతడ్ని బ్రెజిల్ సంతతికి చెందిన ఇటలీ పౌరుడు లూయిస్ కార్లోస్ చెరుబినోగా గుర్తించారు. చర్చిలో పోప్ ప్రసంగం సాగుతున్న సమయంలో తన ఒంటిపై బట్టలు విప్పి నగ్నంగా నడుచుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో అరెస్ట్ చేశారు. కాగా, గత 15 నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం కొనసాగిస్తోంది. మాస్కో సైన్యాలను ఉక్రెయిన్ ప్రతిఘటిస్తూ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది శరణార్ధులుగా మారారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ స్థాయిలో ఐరోపా శరణార్ధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.