తనపై తప్పుడు కథనం ప్రచురించి, పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ బ్రిటన్ పత్రికపై నష్టం దావా వేసిన ప్రిన్స్ హ్యారీ.. ఈ కేసులో కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో 130 ఏళ్ల తర్వాత కోర్టుకు సాక్షిగా హాజరవుతోన్న బ్రిటన్ రాజవంశానికి చెందిన మొదటి వ్యక్తిగా నిలవనున్నారు. ఈ పరువునష్టం దావా వచ్చే వారం లండన్ హైకోర్టులో విచారణకు రానుంది. కింగ్ చార్లెస్ చిన్న కుమారుడు హ్యారీతో పాటు 100 మందికిపైగా ప్రముఖులు డైలీ మిర్రర్ ప్రచురణకర్త మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ సండే మిర్రర్, సండే పీపుల్స్‌కు వ్యతిరేకంగా పరువు నష్టం కేసులు దాఖలు చేశారు.
లండన్ హైకోర్టులో జరిగే విచారణకు ప్రిన్స్ హ్యారీ సాక్షిగా హాజరవుతున్నారు. రాజు కావడానికి ముందు ఎడ్వర్డ్ VII 1870లో విడాకుల కేసులోనూ, 1890లో కార్డ్ గేమ్ ఆరోపణలపై పరువునష్టం దావా విచారణకు హాజరయ్యారు. రెండింటిలోనూ ఒక సీనియర్ రాయల్ సాక్ష్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత ఇప్పటి వరకూ బ్రిటన్ రాజకుటుంబంలోని ఎవరూ కోర్టుకు వెళ్లలేదు. రెండేళ్ల కిందట రాజకుటుంబం నుంచి విడిపోయిన హ్యారీ.. బ్రిటీష్ మీడియాతో చట్టపరమైన వివాదాలు, ఇతర సీనియర్ రాయల్‌పై ఆరోపణలు, నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్‌లను విడుదల వంటి వివాదాలతో గత ఆరు నెలలుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. హ్యారీ కోర్టుకు హాజరైతే ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.
సీనియర్ కమ్యూనికేషన్ అడ్వైజర్, సన్ టాబ్లాయిడ్ వార్తాపత్రిక మాజీ సంపాదకుడు డేవిడ్ యెల్లాండ్ మాట్లాడుతూ.. రాజకుటుంబం చాలా కాలంగా కోర్టు కేసుల నివారించాలని కోరింది ఎందుకంటే వారు పరిస్థితిని నియంత్రించలేరని అన్నారు. ‘ఈ కేసులు తరచుగా పరస్పరం హామీ ఇచ్చిన విధ్వంసానికి సంబంధించినవి. ఎవరైనా గొప్పగా కనిపిస్తారని నేను అనుకోను’ అని ఆయన చెప్పారు. 100 మందికి పైగా వ్యక్తులు దావా వేయగా.. హ్యారీ, మరో ముగ్గురు సాక్షులుగా ఎంపికయ్యారు.
గత నెలలో ఈ కేసు విచారణ ప్రారంభం కాగా.. డైలీ మిర్రర్ జర్నలిస్టులు లేదా వారి ప్రయివేట్ పరిశోధకులు క్షేత్రస్థాయిలో ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని, యువరాజు హ్యారీ సహా ఇతర ప్రముఖుల గురించి సమాచారాన్ని పొందేందుకు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ ఎడిటర్లు, ఎగ్జిక్యూటివ్‌ల ఆమోదంతో ఇది జరిగిందని దావా వేసిన వ్యక్తుల తరఫున న్యాయవాది డేవిడ్ షెర్బోర్న్ వాదించారు. అయితే, ఈ ఆరోపణలను మిర్రర్ గ్రూప్ తోసిపుచ్చింది.
హ్యాకింగ్ గురించి తెలిసిన వారిలో మాజీ ఎడిటర్ పియర్స్ మోర్గాన్ ఒకరని హ్యారీ బయోగ్రఫీ రాసిన జర్నలిస్ట్ కోర్టుకు తెలిపారు. యువరాజు, ఆయన భార్య మేఘన్ మార్కెల్‌ను బహిరంగంగా విమర్శిస్తున్నారని వివరించారు. అయితే, చట్టవిరుద్ధమైన ప్రవర్తనలో ఎటువంటి ప్రమేయం లేదని ఖండించిన మోర్గాన్.. హ్యారీ తన కుటుంబ గోప్యతను అతిక్రమించాడని ఆరోపించారు. మేఘన్ గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన తర్వాత టీవీ బ్రేక్‌ఫాస్ట్ షోలో ప్రెజెంటర్‌గా తన ఉద్యోగానికి మోర్గాన్ రాజీనామా చేశారు.