ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం పశివేదలలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే..... పశివేదల పంచాయతీ కార్యాలయం సమీపంలో రాయంకుల శ్రీరామకృష్ణ(62), బేబి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె లక్ష్మిశ్రీ, కుమారుడు బ్రహేంద్ర ఉన్నారు. బ్రహ్మేంద్ర కొవ్వూరులో నివాసం ఉంటున్నాడు. లక్ష్మిశ్రీకి మేనమామ కొడవలి రత్నాజీతో వివాహమైంది. వారికి ఓ కుమారుడు జన్మించిన కొంతకాలానికి రత్నాజీ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పదేళ్ల క్రితం దొమ్మేరుకు చెందిన నందిగం గోపితో రెండో వివాహం చేశారు. అప్పటినుంచి గోపి భార్య, కుమారుడుతో అత్త, మామల వద్దే ఉంటున్నాడు. లక్ష్మిశ్రీ కుమారుడు సాయిమౌలికి మొదటి భర్త నుంచి వచ్చిన నాలుగున్నర ఎకరాల పంట పొలాన్ని ఇటీవల విక్రయించారు. దానిలో రూ.4.80 లక్షలు తీసి మండలంలోని దొమ్మేరు బ్యాంకులో భర్త తాకట్టుపెట్టిన బంగారు వస్తువులు విడిపించుకురావాలని భార్య లక్ష్మిశ్రీ శుక్రవారం గోపికి చెప్పింది. బంగారం తర్వాత విడిపిద్దాం, ముందు క్రాప్ లోన్ రూ.2.20 లక్షలు కట్టాలని గోపి అన్నాడు. దీంతో అత్తమామలు ఈ రోజు బంగారం విడిపించుకురండి, రేపు క్రాప్‌లోన్ కడదామన్నారు.
ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తనమాట వినడం లేదని, జీవితం సర్వనాశనం చేశారంటూ కోపోద్రిక్తుడైన గోపి పక్కనే ఉన్న 5 కిలోల గ్యాస్ సిలిండర్‌తో అత్త బేబిపై దాడి చేశాడు. అడ్డువచ్చిన కుమారుడు, మామలపై కూడా దాడి చేశాడు. కుమారుడు తప్పించుకోగా, మామ తలకు బలంగా దెబ్బ తగలడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మిశ్రీ పెద్దగా కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు ఇంట్లోకి రావడంతో గోపి నా జీవితం సర్వనాశనం చేశారంటూ, గ్యాస్ సిలిండర్‌ను ప్రహారీగోడపై నుంచి బయటకు విసిరేసి, ఇంట్లోకి వెళ్లి బంగారు వస్తువులు తాకట్టు విడిపించడానికి ఉంచిన రూ.4.80 లక్షలు తీసుకుని బైక్‌పై బయటకు వెళ్లిపోయాడు. అపస్మారకస్థితిలో ఉన్న బేబీని అంబు లెన్స్‌లో కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం నిమిత్తం అక్కడి నుంచి రాజమహేంద్రవరం రిఫర్ చేశారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ వీఎస్‌ఎన్ వర్మ, రూరల్ సీఐ వైవీ రమణ, ఎస్‌ఐ జి.సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులు, స్థానికుల నుం చి వివరాలు సేకరించారు. లక్ష్మిశ్రీ ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సతీష్ తెలిపారు.