ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద బాధిత మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ.50 వేలు చొప్పున అందజేయనుంది. అయితే, టిక్కెట్ లేని ప్రయాణికులకు సైతం పరిహారం లభించనుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ఆధారంగా టిక్కెట్ లేని బాధితులకు పరిహారం అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ ఆదివారం ప్రకటించింది.
‘‘ప్రయాణికులకు టికెట్ ఉందా? లేదా? అనే దాంతో సంబంధం లేకుండా ప్రమాదానికి గురైన వారందరికీ పరిహారం అందుతుంది’’ అని రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ స్పష్టం చేశారు. మరోవైపు, రైల్వే బోర్డు ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం సభ్యురాలు జయ వర్మ సిన్హా మాట్లాడుతూ.. మృతులు, గాయపడిన వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు.. హెల్ప్‌లైన్ నంబరు 139కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ‘‘మృత దేహాలను తీసుకువెళ్లడానికి, గాయపడిన వారిని కలవడానికి కుటుంబసభ్యులు వస్తామంటే మాకు ఫోన్ చేయొచ్చు.. వారి ప్రయాణానికి, ఇతరత్రా అయ్యే ఖర్చులన్నీ మేం భరిస్తాం’’ అని ఆమె చెప్పారు.
ఇదిలావుంటే బాలాసోర్ దుర్ఘటనలో ఇప్పటి వరకూ పరిహారం కింద 285 కేసులకు రూ.3.22 కోట్లను రైల్వే శాఖ చెల్లించింది. వీరిలో 11 మంది మృతులు, 50 మంది తీవ్రంగా గాయపడినవారు, 224 మంది స్వల్పంగా గాయపడినవారు ఉన్నారు. సోరో, ఖరగ్‌పూర్, బాలాసోర్, ఖంతాపారా, భద్రక్, కటక్, భువనేశ్వర్ కేంద్రాలలో ఈ పరిహారం పంపిణీ చేస్తోంది. మరోవైపు, మృతుల్లో 200 మందిని ఇప్పటి వరకూ గుర్తించినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. వారి వివరాలతో కూడిన ఫోటోలను వెబ్‌సైట్‌లో ప్రచురించింది.