రైలు ప్రమాద ఘటన యావత్తు ప్రపంచానికి కుదిపేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఒడిశాలోని బహనగ బజార్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ప్రమాదంలో 275 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇది ఘోర ప్రమాదమని చెబుతున్నారు. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడం.. దాని బోగీలు పక్కన ట్రాక్ మీది నుంచి వెళ్తున్న బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ మీద పడ్డాయి. రెండు రైళ్లు వేగంగా దూసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో.. ప్రాణ నష్టం ఎక్కువగా వాటిల్లింది. ఈ ప్రమాదం జరిగాక.. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది బతికి ఉన్న వారిని హాస్పిటల్‌కు తరలించగా.. మృతదేహాలను మార్చురీలకు తరలించారు.
ఈ క్రమంలో శవాలను ఓ ట్రాలీలో ఒకదానిపై మరొకటి వేస్తూ.. మార్చురీకి తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది పెను ప్రమాదం కావడం.. తక్షణమే స్పందించాల్సి రావడంతో ఇంతకు మించి మరో గత్యంతరం లేకపోయింది. కాగా ఈ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని కూడా చనిపోయారనుకొని.. శవాల మధ్య పడేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పదేళ్ల బాలుణ్ని అతడి అన్నయ్య శవాల మధ్య నుంచి బయటకు తీసి కాపాడుకోవడమే దీనికి కారణం.
బాలాసోర్‌లోని భోగరాయ్‌కి చెందిన పదేళ్ల దేబశిష్ పాత్రా ఐదో తరగతి చదువుతున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో భద్రక్‌లోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. దేబశిష్‌తోపాటు అతడి తల్లిదండ్రులు, అన్నయ్య సైతం ఆ రైళ్లోనే వెళ్తున్నారు. బాలాసోర్ స్టేషన్ దాటిన కాసేపటి తర్వాత అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చి రైలు కుదుపులకు లోనైంది. అంతా చీకటిగా మారిపోయింది. దేబశిష్ స్పృహ కోల్పోయాడు.
దేబశిష్‌కు నుదురు, ముఖం మీద గాయాలయ్యాయి. దీంతో అతడు ప్రమాదం తర్వాత సహాయక చర్యలు చేపట్టిన వారు అతడు చనిపోయాడని భావించారు. దీంతో శవాల మధ్యలో అతణ్ని విసిరేశారు. పదో తరగతి చదువుతోన్న దేబశిష్ అన్నయ్య.. తన తమ్ముడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించాడు. యాక్సిడెంట్ శుక్రవారం సాయంత్రం జరగ్గా.. మరుసటి రోజుకు తమ్ముణ్ని గుర్తించగలిగాడు. దేశబిష్ మీద ఏడు శవాలు ఉండగా.. వాటిని తొలగించి.. తమ్ముడిని గుర్తించాడు. అప్పటికీ అతడు ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించి వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం దేబశిష్ ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్నాడు. తమ్ముడి ఆచూకీ కోసం అన్నయ్య ప్రయత్నించకపోతే..? అతడు కూడా చనిపోయాడని భావించి ఉంటే..? ఓ నిండు ప్రాణం బలయ్యేది.