ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 278 మంది మృతిచెందగా.. 1,100 మందికిపైగా గాయపడ్డారు. అయితే, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో చిక్కుకున్న కనీసం 40 మృతదేహాలను వెలికితీయగా.. వాటిపై ఎటువంటి గాయాల గుర్తులు లేకపోవడంతో విద్యుదాఘాతానికి గురై ఉంటారని భావిస్తున్నారు. తెగిపడిన ఓవర్ హెడ్ కేబుల్స్ ద్వారా షాక్‌కు గురై ఉంటారని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు.
లైవ్ ఓవర్‌హెడ్ కేబుల్స్ బోగీలపై పడటంతో చాలా మంది మరణాలకు విద్యుదాఘాతమే కారణమని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ‘ఓవర్ హెడ్ ఎల్టీ (తక్కువ తీవ్రత) లైన్‌తో తాకిడి, తర్వాత విద్యుదాఘాతం కారణంగా చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు’ అని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) సబ్-ఇన్‌స్పెక్టర్ పాపు కుమార్ నాయక్ శనివారం తెల్లవారుజామున ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
చెన్నైకి వెళ్తోన్న కోరమాండల్ రైలు.. బహనాగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద లూప్‌లైన్‌లోకి వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు యశ్వంత్‌పూర్ (బెంగళూరు)-హౌరా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలపైకి దూసుకెళ్లడంతో కేబుల్స్ తెగిపోయాయి.
‘చాలా వరకూ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.. అందులో దాదాపు 40 వాటిపై ఎటువంటి గాయాలు గుర్తులు, రక్తస్రావం అయినట్టు కనిపించలేదు.. వీరి మరణానికి విద్యాదాఘాతం కారణం కావచ్చు’ అని ఆ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ పూర్ణ చంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ కేబుల్స్ రైలుపై పడి బోగీలలోని కొంత భాగాన్ని సెకనులో తాకే అవకాశం ఉందని, దీంతో విద్యుదాఘాతానికి గురై ఉంటారని చెప్పారు. ఇక, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, గుర్తుతెలియని వ్యక్తులపై జీఆర్పీ కేసు నమోదుచేసింది. రైలు దుర్ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి ముందు డీఎస్పీ ర్యాంక్ అధికారిని రైల్వే నియమించింది. ప్రమాదం జరిగిన ఆరు గంటల తర్వాత నమోదైన ఫిర్యాదు ఆధారంగా కటక్‌లోని డివిజనల్ రైల్వే పోలీసు అధికారికి రంజీత్ నాయక్‌కు విచారణ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు, విచారణను అధికారికంగా చేపట్టేందుకు జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని సీబీఐ బృందం మంగళవారంలోగా ఒడిశాకు రానున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ సమాచారం ఇచ్చినట్టు వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ప్రజా విచారణకు ముందు ముందు రైల్వే సేఫ్టీ కమిషనర్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు.